గ్రూప్ 1 అక్రమాలపై విచారణకు సీజేఐకి కవిత లేఖ

గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాశారు. తెలుగు మీడియం మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని నియామకాలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు విరుద్ధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

Kalvakuntla Kavitha

విధాత : గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్టు తనకు నిరుద్యోగులు ఫిర్యాదులు చేశారని లేఖలో కవిత పేర్కొన్నారు. నిరుద్యోగులు లేవనెత్తుతున్న అంశాలపై సుమోటోగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కవిత గ్రూపు-1 పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. ఈ విషయాన్ని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని ఇటీవల ఆరోపించారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని టీజీపీఎస్సీ ముందు ధర్నా సైతం చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్స్ కి మరొక హాల్ టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తన ఆరోపణల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఇటీవలే గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు సైతం అందజేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 562 మందికి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అత్యంత పారదర్శకంగా, నిబద్ధతతో గ్రూప్ – 1 పరీక్షలు నిర్వహించామని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కేవలం 19 నెలల వ్యవధిలో గ్రూప్‌-1 ప్రక్రియ పూర్తి చేసి, న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించామని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.