వరంగల్లో పీడీఎస్ యూ రాష్ట్ర మహాసభలు

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం (PDSU) 23వ రాష్ట్ర మహాసభలను డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో వరంగల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. NEP 2020, కార్పొరేట్ విధానాలపై విమర్శలు చేసింది.

విధాత, వరంగల్ ప్రతినిధి: ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన పీడీఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10,11,12 తేదీలలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది. హనుమకొండలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీడీఎస్ యు జాతీయ నాయకులు పి. మహేష్, రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.వి. శ్రీకాంత్, పొడపంగి నాగరాజు లు మాట్లాడారు. ఉద్యమాల పురిటి గడ్డైన ఉస్మానియా యూనివర్సిటీ లో 1970వ దశకంలో నక్సల్ బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల స్ఫూర్తితో పురుడు పోసుకున్న ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం శాస్త్రీయ విద్యా సాధన,సమసమాజ స్థాపనే లక్ష్యంగా పోరాడుతుందన్నారు.సమాజ అసమానతలకు వ్యతిరేకంగా, అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య కోసం పోరాడుతుందని వివరించారు. ఈ లక్ష్యసాధనలో జార్జిరెడ్డి, జే సి ఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, చేరాలు, రంగవల్లి లాంటి ఎందరో విద్యార్థి యువకిశోరాలు ఈ వ్యవస్థ మార్పుతమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని చెప్పారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం తిరుగులేని శక్తిగా దేశవ్యాప్తంగా నిలిచి విద్యార్థుల గొంతుకై విద్యారంగ సమస్యలపై రాజీలేని ఉద్యమాలను నిర్వహిస్తూ,సమాజంలో ఉన్న రుగ్మతల,వివక్షతలకు వ్యతిరేకంగా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ప్రగతిశీల పోరాటాలను నిర్వహిస్తుందన్నారు.

అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు యుద్ధ ఉన్మాదంతో పాలస్తీన ప్రజల హనానికి పాల్పడుతుందని విమర్శించారు. అమెరికా టారిఫ్ ల పేరుతో ప్రపంచ దేశాలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని, సంక్షోభం నుండి బయటపడడానికి యుద్ధాలని రెచ్చగొడుతుందన్నారు. హౌడి మోడీ అని ట్రంపు ను గెలిపించాలని కోరిన బిజెపి అదే ట్రంప్ దేశంపై సుంకాలను విధించిన మాట్లాడే పరిస్థితి లేదని విమర్శించారు. మోడీ నూతన జాతీయ విద్యా విధానం 2020 తో ఉన్నత విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందన్నారు. బిజెపి యుద్దం ఉన్మాద, కార్పొరేట్ విధానాల వల్ల దేశంలో రోజురోజుకు అన్ని రంగాల్లో అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బిజెపిని వ్యతిరేకించిన సంస్థలు, వ్యక్తులు ఉద్యమకారులు, జర్నలిస్టులపై ఫాసిస్టు చర్యలతో అణిచివేస్తుందన్నారు. దేశంలో విద్య ,ఉపాధి, వైద్య అవకాశాలు పేదవారికి మరింత దూరం అవుతున్నాయని అన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. డిసెంబర్ 10 11 12 వ తేదీల్లో విప్లవాల గడ్డ వరంగల్ లో పీడీఎస్ యు రాష్ట్ర మహాసభలను జరుపుతున్నామని ఈ తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారావు రాజేశ్వర్, శ్రీకాంత్, సహాయ కార్యదర్శి మస్తాన్, రాష్ట్ర కోశాధికారి రాణా ప్రతాప్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్ , నాయకులు ప్రకాష్ రాజ్, సూర్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.