IRCTC Tourism | జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీ కోసమే స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

ఆది దేవుడు పరమేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయి. ఇందులో జ్యోతిర్లింగ క్షేత్రాలకు ఎంతో విశిష్టత ఉన్నది. ఈ క్షేత్రాలను ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలని చాలా మంది హిందువులు భావిస్తుంటారు

  • Publish Date - March 11, 2024 / 04:34 AM IST

IRCTC Tourism | ఆది దేవుడు పరమేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయి. ఇందులో జ్యోతిర్లింగ క్షేత్రాలకు ఎంతో విశిష్టత ఉన్నది. ఈ క్షేత్రాలను ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలని చాలా మంది హిందువులు భావిస్తుంటారు. ఈ ఆలయాలు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో పాటు భారీగా ఖర్చవుతుందని వెళ్లేందుకు వెనుకాడుతుంటారు. అయితే, అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ బంపర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది.

తక్కువ బడ్జెట్‌లోనే జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేలా ఈ ప్యాకేజీని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ‘మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌’ పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భోపాల్‌, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌ ప్రాంతాలను చుట్టి రావొచ్చు. ప్రస్తుతం మార్చి 20న ప్యాకేజీ అందుబాటులో ఉండగా.. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు టూర్‌ కొనసాగుతుంది.

ప్రయాణం ఇలా..

మార్చి 20న తొలిరోజు సాయంత్రం 4. 40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ 12707 రైలులో ప్రయాణం ఉంటుంది. మరుసటిరోజు ఉదయం 8.15 గంటలకు భోపాల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుతారు. ఆ తర్వాత హోటల్‌లోకి వెళ్తారు. అక్కడ సాంచి స్తూపాన్ని సందర్శిస్తారు. అనంతరం భోపాల్‌లో ఉండే ట్రైబల్‌ మ్యూజియం, తాజ్‌ ఉల్‌ మసీద్‌ను వీక్షిస్తారు. రాత్రి భోపాల్‌లోనే బస ఉంటుంది. మూడోరోజు హోటల్‌ను ఖాళీ చేసి ఉజ్జయినికి బయలుదేరి వెళ్తారు.

అక్కడ మహకాళేశ్వర్‌ ఆలయంతో పాటు స్థానికంగా ఉండే ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది. నాలుగో రోజు ఉదయం ఓంకారేశ్వర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటున్నారు. ఐదోరోజు ఆదివారం మహేశ్వర్‌కు వెళ్తారు. అక్కడ ఐలాదేవి పోర్ట్‌, మండు ఫోర్ట్‌ చూసుకొని ఇండోర్‌కి బయలుదేరి వెళ్తారు. రాత్రి 7 గంగలకు అంబేద్కర్‌ రైల్వేస్టేషన్‌ చేరుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు రైలు కాచిగూడకు చేరుకోవడంతో ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ఇలా..

ప్యాకేజీ స్లీపర్‌, థర్డ్‌ ఏసీ అందుబాటులో ఉన్నది. థర్డ్‌ ఏసీలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.37,810, డబుల్‌ షేరింగ్‌కు రూ.21,150, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.16,390గా నిర్ణయించారు. ఇక స్లీపర్‌ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.35,320, డబుల్‌ షేరింగ్‌కు రూ.18,66౦, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.13,900గా నిర్ణయించారు. అయితే, పిల్లలకు ప్రత్యేకంగా ప్యాకేజీలో ధర నిర్ణయించారు. ప్యాకేజీలోనే రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్నర్‌ ప్యాకేజీలోనే కవర్‌ కానున్నాయి. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR097లో సంపద్రించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.

Latest News