Site icon vidhaatha

వీడు మామూలు దొంగ కాదు.. 27 ఏండ్ల‌లో 5 వేల కార్లు చోరీ

విధాత: వీడు మామూలు దొంగ కాదు.. దొంగ‌ల‌కే గ‌జ దొంగ‌. వీడి దొంగ‌త‌నాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. కేవ‌లం కార్ల‌నే దొంగ‌త‌నం చేస్తూ.. విలాస‌వంత‌మైన జీవితాన్ని గడుపుతున్నాడు. 27 ఏండ్ల‌లో 5 వేల కార్లు చోరీ చేసి.. కోట్ల రూపాయాల విలువ చేసే ఆస్తులు కూడ‌బెట్టాడు. ఇక ఈ గ‌జ దొంగ‌పై 180 క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అనిల్ చౌహాన్‌(52) 1995లో ఆటో రిక్షా న‌డుపుతూ త‌న జీవితాన్ని ప్రారంభించాడు. ఢిల్లీలోని కాన్‌పూర్ ఎక్స్‌టెన్ష‌న్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. ఇక 1998 నుంచి కార్ల దొంగ‌త‌నం ప్రారంభించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్ల‌ను దొంగిలించేవాడు.

మారుతి 800 కార్ల‌ను అధికంగా దొంగిలించి, వీటిని జ‌మ్మూక‌శ్మీర్, ఈశాన్య రాష్ట్రాల‌తో పాటు నేపాల్‌లో అమ్మేసేవాడు. ఆ కార్ల‌ను అమ్మ‌గా వ‌చ్చిన ఆదాయంతో.. ఢిల్లీ, ముంబై, అసోంలో ఆస్తుల‌ను కూడ‌ బెట్టుకున్నాడు. ఢిల్లీలో విలాస‌వంత‌మైన జీవితాన్ని గడుపుతున్నాడు.

అయితే ఓ కేసులో త‌ప్పించుకు తిరుగుతున్న అనిల్ చౌహాన్‌ను పోలీసులు ఇటీవ‌ల అరెస్టు చేశారు. అత‌ను ప్ర‌స్తుతం ఆయుధాల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆరు కంట్రీమేడ్ పిస్తోల్స్‌తో పాటు ఏడు క్యాట్రిడ్జ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇక అసోంలో అనిల్ ప్ర‌భుత్వ కాంట్రాక్ట‌ర్‌గా కూడా కొన‌సాగుతున్నాడు. అసోంలోని స్థానిక నేత‌ల‌తో అనిల్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అసోంలో 2015లో ఓ కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు అనిల్ కూడా అరెస్ట‌యి జైలు జీవితం గ‌డిపాడు. అనిల్ చౌహాన్‌కు ముగ్గురు భార్య‌లు కాగా, ఏడుగురు సంతానం.

Exit mobile version