విధాత: ఇప్పటి వరకు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించడం చూశాం.. కానీ కని వినీ ఎరగని రీతిలో విడాకుల వేడుక ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విడాకుల వేడుకను ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్జీవో సంస్థ భాయ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. భాయ్ వేల్ఫేర్ సొసైటీ.. 2014లో ఏర్పాటైంది. భార్యల నుంచి హింస ఎదుర్కొంటూ, విడాకుల కోసం పోరాడుతున్న భర్తలకు అండగా ఉంటోంది ఈ సంస్థ. అలా ఈ రెండు, మూడేండ్లలో ఓ 18 మంది మగాళ్లకు విడాకులు ఇప్పించడంలో భాయ్ వెల్ఫేర్ సొసైటీ కీలక పాత్ర పోషించింది.
అయితే ఈ విడాకులు పొందిన 18 మంది పురుషులతో కలిసి విడాకుల వేడుకను ఘనంగా నిర్వహించాలని సొసైటీ ప్లాన్ చేసింది. భోపాల్ శివార్లలోని ఓ రిసార్ట్‌లో వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఈ విడాకుల వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ సందర్భంగా భాయ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ జాకీ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ వేడుకను కొందరు ఆహ్వానిస్తుంటే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకను నిర్వహించొద్దని కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
మేం కావాలని విడాకులను ప్రోత్సహించట్లేదు. భార్యలతో వేధింపులకు గురవుతున్న చాలామంది భర్తలు.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిని నివారించేందుకు ఉచిత న్యాయ సలహా మాత్రమే ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విడాకులు కోరుకునే భర్త.. కోర్టులో తనకు విడాకులు మంజూరు కాకపోతే మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.
ఇక విడాకుల వేడుకకు హాజరయ్యే వారికి భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా జయమాల విసర్జన్ (వివాహ మాల నిమజ్జనం), మగవాళ్ల సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి ఈవెంట్స్ ను కూడా నిర్వహించనున్నారు.