- 44వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
న్యూ ఢిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆందోళనలో ఉన్న ప్రజలకు ఊరట కల్పిస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనాపై పోరులో ఉపయోగించే ఔషధాలు, వైద్య పరికాలు సహా ఇతర సామగ్రిపై పన్నులు తగ్గించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై పన్నులు తొలగించారు.
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలి భేటీ అయ్యింది. భేటీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా నిర్ణయించిన ఈ పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయి. కరోనా వ్యాక్సిన్లపై ఉన్న 5 శాతం జీఎస్టీని అలాగే కొనసాగించనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. టీకాలపై జీఎస్టీని పూర్తిగా తగ్గించడం వల్ల ఔషధ సంస్థలు తయారీ ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం మోపే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీని సైతం కేంద్రమే భరించనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం వాటాను తిరిగి రాష్ట్రాలకే కేటాయింపుల ద్వారా పంచనున్నామని ఆమె తెలిపారు.
పన్నులు తగ్గించిన ఔషధాలు, వైద్యపరికరాలు, ఇతర సామగ్రి వివరాలు ఇలా ఉన్నాయి.
- ఔషధాలు
టొసిలిజుమాబ్‌పై ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే ఆంఫోటెరిసిన్-బి పైన ఉన్న 5 శాతం పన్నును సైతం పూర్తిగా తొలగించారు.
హెపరిన్ వంటి యాంటీ కొయాగులెంట్స్‌పై ఉన్న 12 శాతం జీఎస్టీని సైతం 5 శాతానికి తగ్గించారు.
రెమ్‌డెసివిర్‌పై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఫార్మా విభాగం సూచించిన ఇతర కరోనా సంబంధిత ఔషధాలపై 5శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత పరికరాలు
మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌పై ఉన్న 12 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, జనరేటర్లపైనా జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. వెంటిలేటర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. వెంటిలేటర్ మాస్కులు, క్యానులా, హెల్మెట్లపై కూడా జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు. BiPAP యంత్రంపై ఉన్న 15 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. హైఫ్లో నాసల్ క్యానులా పరికరంపైనా జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
- టెస్టింగ్ కిట్లు, యంత్రాలు
కరోనా టెస్టింట్ కిట్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. స్పెసిఫైడ్ ఇన్‌ఫ్లమేటరీ డయాగ్నోస్టిక్ కిట్లు అయిన డి-డైమర్, ఐఎల్-6, ఫెర్రిటిన్ అండ్ ఎల్‌డీహెచ్‌పైన కూడా జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి కుదించారు.
ఇతర కొవిడ్ సంబంధిత సామగ్రిపై
పల్స్ ఆక్సిమీటర్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
శానిటైజర్లపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి కుదించారు.
ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలపై ఉన్న 15 శాతం జీఎస్టీని సైతం 5 శాతానికి తగ్గించారు.
అంత్యక్రియల్లో వినియోగించే గ్యాస్, ఎలక్ట్రిక్ సహా ఇతర ఫర్నేస్‌లపై ఉన్న 18 శాతం జీఎస్టీని సైతం 5 శాతానికి కుదించారు.
అంబులెన్సు సేవలపై ఉన్న 28 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.
గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో జీఎస్టీ తగ్గింపు విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఇందులో ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రుల బృందాన్ని నియమించారు. ఆ బృందం తమ నివేదికను గత సోమవారం ఆర్థిక శాఖకు సమర్పించింది. దీనిపైనే నేడు చర్చలు జరిగాయి.