ఇండియాదా! ఎన్డీయేదా!.. ఢిల్లీ పీఠం ఎవరిది?

ఇరవైయ్యేళ్ల తర్వాత తిరిగి జూన్ 4న 2004 నాటి పరిస్థితి పునరావృతమవుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చెబుతున్నారు.

  • Publish Date - May 23, 2024 / 12:10 AM IST

2004 పరిస్థితి పునరావృతం అంటున్న కాంగ్రెస్‌
బీజేపీ మెజార్టీ సాధిస్తే సమస్య ఉండదు
ఎన్డీయేను మించి ఇండియాకు సీట్లు వస్తే
ప్రతిపక్ష కూటమిని రాష్ట్రపతి ఆహ్వానిస్తారా?
మోదీని కాదని ముర్ము వ్యవహరించగలరా?
ఎన్నికల ముందు కూటమికే తొలి అవకాశం
తేల్చి చెబుతున్న సర్కారియా, పూంఛీ కమిషన్లు
వాటిని ఉల్లంఘిస్తే రాజకీయ సంక్షోభమే!

(విధాత ప్రత్యేకం)

న్యూఢిల్లీ: ఇరవైయ్యేళ్ల తర్వాత తిరిగి జూన్ 4న 2004 నాటి పరిస్థితి పునరావృతమవుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం దిగిపోతుందన్న ఆశాభావం చాలా మంది ప్రతిపక్ష నాయకుల్లో వ్యక్తం అవుతున్నది. అయితే అది అంత సులువుగా జరుగుతుందా? అన్నది అనుమానం. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఏకైక పెద్ద పార్టీ లేక ఎన్నికలకు ముందు ఏర్పడిన ఏకైక పెద్ద కూటమి దేనికి మెజారిటీ సీట్లు వస్తే దానిని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని సర్కారియా కమిషన్‌, పూంఛీ కమిషన్‌ రెండూ సూచించాయి.

ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటములను ఒకే పార్టీగా పరిగణించాలని కూడా కమిషన్‌లు సూచించాయి. ఒక వేళ ఏ పార్టీకీ లేక కూటమికీ మెజారిటీ రాకపోతే ఏమి చేయాలో కూడా పూంఛీ కమిషన్‌ సూచించింది. మెజారిటీ పార్టీ, మెజారిటీ కూటములు ఆవిర్భవించని పక్షంలో ఎన్నికల అనంతరం మెజారిటీని సూచించే కూటమిని లేక పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలువవచ్చునని కమిషన్‌లు సూచించాయి. మార్గదర్శకాల వరుస క్రమాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నాయి. పూంఛీ కమిషన్‌ సూచించిన దాని ప్రకారం.. ఒక పార్టీకి మెజార్టీ రాని పక్షంలో తొలుత ఎన్నికల ముందు ఏర్పడిన కూటమిలలో దేనికి ఎక్కువ స్థానాలు వస్తే దానిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.

ఒకవేళ ఇండియా కూటమి మెజార్టీ స్థానాలు గెలిస్తే.. ఇండియా కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే.. ఈ మార్గదర్శకాలకు నరేంద్రమోదీ కట్టుబడి ఉంటారా అన్నది అనుమానం. నిజానికి బీజేపీ కూడా ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకునే గత ఐదేళ్లూ మూలన పడేసిన ఎన్‌డీఏను తిరిగి పునరుద్ధరించింది. చిన్నా పెద్ద పార్టీలను పోగేసి పెద్ద కూటమినే ఏర్పాటు చేసింది. అందులో చాలా పార్టీలు ఒకటిరెండు స్థానాలు మాత్రమే గెలిచే స్థాయి ఉన్నవి.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి? బీజేపీకి అధికారంలోకి వచ్చేటన్ని స్థానాలు రాకపోయినా ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందన్న విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. రెండు వందల స్థానాలు వచ్చినా అదే ఏకైక పెద్ద పార్టీ అవుతుంది. కానీ ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటములు ఉన్నప్పుడు కూటముల బలాన్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎన్‌డీఏ, ఇండియా కూటములలో దేనికి ఎక్కువ స్థానాలు వస్తే దానినే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. కానీ నరేంద్రమోదీ ఆ సంప్రదాయాన్ని అమలు చేయనిస్తారా? అన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీని కాదని రాష్ట్రపతి ముర్ము వ్యవహరించగలరా? అన్నది సందేహాస్పదం.

మరో రెండు దశల పోలింగ్‌తో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. జూన్‌ నాలుగున ఎలాంటి ఫలితం వస్తుందనేది ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు ఆశించినంత స్థాయిలో సీట్లు రాకపోవచ్చనే అంచనాలు రాజకీయ విశ్లేషకుల్లో వెలువడుతున్నాయి. లోక్‌సభలో 543 సీట్లకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు ఒక పార్టీ లేదా కూటమికి 272 స్థానాలు అవసరం. అయితే.. ఏ పార్టీ లేదా కూటమి మెజార్టీని సాధించలేని పక్షంలో రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమికే మెజారిటీ స్థానాలు వస్తే నరేంద్రమోదీ అధికారానికి పెద్దగా సమస్య ఉండదు.

ఎన్‌డీఏకు మెజారిటీ కంటే స్థానాలు తగ్గితేనే సమస్య. ఎన్‌డీఏలో గణనీయంగా స్థానాలు గెలిచే పార్టీలు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానాలే వారికి ఆలంబన. బీజేపీకి ఒంటరిగా 2014 ఎన్నికల్లో వచ్చిన 238 స్థానాలే వస్తే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ 25 స్థానాలు, ఒరిస్సా 21 స్థానాలలో అత్యధికం ఎన్‌డీఏకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ బీజేపీకి 200 లేక 210 స్థానాలే వస్తే దాని మిత్ర పక్షాల బలం కూడా సరిపోదు. అలా కాకుండా ఇండియా కూటమికే మెజారిటీ స్థానాలు వస్తే సంప్రదాయం ప్రకారం ముందుగా ఇండియా కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి ఉంటుంది. సర్కారియా కమిషన్‌, పూంఛీ కమిషన్‌ల మార్గదర్శకాల ఉల్లంఘన జరిగితే అది పెద్ద రాజకీయ సంక్షోభానికి దుమారానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవీ పూంఛీ కమిషన్‌ సిఫారసులు..

అతిపెద్ద రాజకీయ పార్టీ లేదా, కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.
ఒక పార్టీకి పూర్తి మెజార్టీ ఉంటే.. సహజంగానే దాని నేత ప్రధాని అవుతారు.
అటువంటి పార్టీ లేని పక్షంలో.. కింద పేర్కొన్న ప్రాధమ్యాల ఆధారంగా ఒక పార్టీ లేదా కూటమి నేతను ప్రధానిగా నియమించాలి.

1. ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి
2. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉన్న ఏకైక అతిపెద్ద పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరవచ్చు.
3. ఎన్నికల అనంతరం ఏర్పడే సంకీర్ణ కూటమి.
4. స్వతంత్ర సభ్యులు, బయటి నుంచి ఇతర పార్టీల మద్దతు కలిగిన ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమి.

ఇవీ సర్కారియా కమిషన్‌ సిఫారసులు

1. తగిన మెజార్టీ కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.
2. ఏ రాజకీయ పార్టీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యలో సభ్యుల మద్దతు లేనిపక్షంలో సంకీర్ణ కూటమి నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, సభలో బలం నిరూపించుకోవాలని కోరవచ్చు.
3. సంకీర్ణ కూటమి ఎన్నికలకు ముందుగానే  ఏర్పడి ఉండాలి.

Latest News