అందరి దృష్టి ఆరో విడుతపైనే!.. ‘ఎన్డీఏ’, ‘ఇండియా’ బలం తేల్చది ఇవే

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదు దశల పోలింగ్‌ పూర్తయ్యింది. ఇప్పటివరకు పోలింగ్‌ జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, యూపీ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి గత ఫలితాలు పునరావృతం కావని తేలిపోయింది.

  • Publish Date - May 22, 2024 / 05:53 PM IST

హర్యానాలో బీజేపీకి జాట్‌ల ఝలక్‌
ఢిల్లీ, యూపీలలో ఇండియా వర్సెస్‌ ఎన్డీఏ
ఒడిశాలో బీజేడీ, బీజేపీ మధ్యే పోటీ
బెంగాల్‌లో పట్టుకోసం టీఎంసీ, బీజేపీ
కీలకం కానున్న తుది 2 దశల పోలింగ్‌

(విధాత ప్రత్యేకం)

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదు దశల పోలింగ్‌ పూర్తయ్యింది. ఇప్పటివరకు పోలింగ్‌ జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, యూపీ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి గత ఫలితాలు పునరావృతం కావని తేలిపోయింది. ఆ పార్టీకి నిరాశ కలిగించేలా సీట్లు గణనీయంగా తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ నేతల మాటల్లో ఆ నమ్మకం సడలిందన్న భావన కనిపిస్తున్నది. మెజార్టీకి దూరంగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘ఇప్పటికే 300 సీట్లు దాటేశాం.. రాబోయే రెండు దశల్లో కలిసి 400 మార్క్‌ను చేరుకుంటాం’ అని బీజేపీ అగ్రనాయకత్వం చెబుతున్నా అదంతా మేకపోతు గాంభీర్యంగానే రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

బీజేపీ సొంతంగా గతంలో గెలిచిన స్థానాల్లో కొన్నింటిని మాత్రమే ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే కోల్పోతుందంటే.. మూడోసారి ఆ పార్టీ మెజారిటీ అనేది ఇప్పుడు చర్చలోనే ఉండేది కాదు. కానీ మొత్తానికి మొత్తం పోటీ చేసిన రాష్ట్రాల్లోనే సగం వరకు కోల్పోతుందనేదే కాషాయ నేతల కలవరపాటుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు మోదీ ప్రభుత్వ పదేళ్ల విధానాలపై వ్యతిరేకతకు తోడు ఆపార్టీ ఓట్లు వస్తాయనుకున్న అంశాలను ప్రజలు సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమని ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌ సరళీని బట్టి అంచనా వేస్తున్నారు.

ఎన్డీయేకూ, ఇండియాకూ కీలకం

ఇక కీలకమైన ఆరో, ఏడో దశల్లో జరిగే ఎన్నికలు ఇండియా కూటమికి కీలకమైనవే. అంతకంటే ఎన్డీఏ కూటమికి మరీ ముఖ్యమైనవి. ఆరో దశ ఎన్నికలకు పోలింగ్‌ మే 25న జరగనున్నది. ఇందులో హర్యానాలోని 10, ఢిల్లీలోని 7 మొత్తం స్థానాలతో పాటు బీహార్‌లోని 8, యూపీలోని 14, పశ్చిమబెంగాల్‌లోని 8, ఒడిషాలోని 6 స్థానాలకు పోలింగ్‌ ఉంటుంది. వీటిలో హర్యానా, ఢిల్లీలలో బీజేపీకి అంత ఆశాజనక పరిస్థితులు లేవని పరిశీలకులు భావిస్తున్నారు.

క్లీన్‌స్వీపా? స్వింగా?

హర్యానాలో రైతుల ఆందోళన, ఖట్టర్‌ ప్రభుత్వానికి జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయనను తొలిగించి ఓబీసీ నేత నాయబ్‌ సింగ్‌ సైనిని బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేసింది. అయినా ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడి.. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. హర్యానాలో జాట్‌ల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. భవానీ మహేంద్రగడ్‌, సోనీపత్‌, హిసార్‌ నియోజకవర్గాల్లో జాట్‌లు ఫలిత నిర్ణేతలు. ఈ రాష్ట్రంలో జాట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నారనే వాదన ఉన్నది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన రైతుల్లో పంజాబ్‌, హర్యానా రైతులే ఉన్నారు.

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని ఆ రాష్ట్ర రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న మెజారిటీ స్థానాల్లో రైతుల మద్దతే కీలకం కానున్నది. జాట్‌లు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నది స్పష్టమైంది. అందుకే రాష్ట్రంలో 40 శాతంగా ఉన్న ఓబీసీల మద్దతుతో గత ఎన్నికల వలె క్లీన్‌ స్వీప్‌పై బీజేపీ అధిష్ఠానం ఆశలు పెట్టుకున్నది. రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 అంశాలను బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నది.

రైతులు, కార్మికులు, వ్యాపారులు, మహిళలు, యువత, ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులను ఇండియా కూటమి ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. సైనీ ప్రభుత్వానికి స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా బల నిరూపణ కోసం డిమాండ్ చేశారు. జేజేపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటిదాకా భాగస్వామిగా ఉన్న పార్టీ మద్దతు ఉపసంహరించుకోగానే ఆ పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించింది. నలుగురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నది.

దీంతో ఇప్పుడు జాట్‌లకు నాయకత్వం వహిస్తున్న జేజేపీ, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. బీజేపీ అధికారం కోసం ప్రాంతీయపార్టీలను ఎలా చేరదీస్తుంది? వాళ్ల పక్షాన లేకుండా ఎదురుతిరిగితే ఏం చేస్తుంది? అన్నదానికి హర్యానాలోని జేజేపీలో నెలకొన్న సంక్షోభమే ఉదాహరణ అంటున్నారు. అందుకే ఈ రెండు పార్టీలూ బీజేపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నట్టు అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాషాయ పార్టీ ఆశిస్తున్న క్లీన్‌స్వీప్‌ సాధ్యమౌతుందా? స్వింగ్‌ అవుతుందా? అన్నది చూడాలి.

ఢిల్లీ, యూపీలలో ఇండియా, ఎన్డీఏ నువ్వా నేనా?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విడుదలై ఎన్నికల ప్రచారంలో మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై దాడి కేసులో కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభ‌వ్ కుమార్ అరెస్ట్‌ను నిర‌సిస్తూ బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ ఆపరేషన్‌ ఝాడూ చేపట్టిందని ఆరోపిస్తూ అరెస్టులకు భయపడేది లేదని సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ ఆఫీస్‌ ముందు బలప్రదర్శన చేశారు. ఢిల్లీ, ఝార్ఖండ్‌, యూపీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఇండియా కూటమి తరఫున కేజ్రీవాల్‌ విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

జూన్‌ 4 తర్వాత దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి.. మోదీ వెళ్లిపోబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిపై మోదీ సహా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్న కుటుంబ రాజకీయాలు, ముస్లింల రిజర్వేషన్ల అంశం, రామమందిరానికి తాళం వేస్తారన్న విమర్శలను ఆయనతోపాటు రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌యాదవ్‌, ప్రియాంకగాంధీ తిప్పికొడుతున్నారు. పదేళ్లలో మోదీ చేసిన పనుల గురించి, దేశంలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడే ధైర్యం ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసింది ఏమీ లేదని, అందుకే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

బీజేడీ, బీజేపీ మధ్య హోరాహోరీ

ఒడిషాలో బీజేడీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్‌లోనూ టీఎంసీ, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న మమత నాలుగు దశల పోలింగ్‌ పూర్తయ్యాక తాము ఇండియా కూటమిలోనే ఉన్నామని, రేపు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించినా వెనక్కి తగ్గకపోవడం వల్ల అక్కడ ఇండియా కూటమికి కొంత ఇబ్బంది నెలకొనే అవకాశం ఉన్నది.

బీహార్‌లో కింగ్‌మేకర్‌లు బీసీలే

బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బీహార్‌లోని 8 నియోజకవర్గాలకు మార్చి 25న ఆరో విడతలో పోలింగ్‌ జరగనున్నది. పోలింగ్‌ జరిగే వాల్మీకి నగర్‌, పశ్చిమ చంపారన్‌, తూర్పు చంపారన్‌, శివ్‌హర్‌, వైశాలి, గోపాల్‌గంజ్‌, సివాన్‌, మహరాజ్‌గంజ్‌లలో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, హిందుస్థానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్‌మోర్చా, లోక్‌ జనశక్తిలు ఉండగా.. ఇండియా కూటమిలో ఆర్జేడీ కాంగ్రెస్‌, లెఫ్ట్‌, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీలున్నాయి. కొత్త పొత్తులతో పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నియోజకవర్గాల్లో బీసీలే విజేతలను నిర్ణయించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బ్రాహ్మణులు, రాజ్‌పూత్‌లు, కుర్మీ..కొయెరీ, దళితులు, మహా దళితుల ఓట్లపై ఎన్డీఏ ఆధారపడుతున్నది. ముస్లింలు, యాదవ్‌లు, ఈబీసీలు, ఎంబీసీల ఓట్లను ఇండియా కూటమి నమ్ముకుంటున్నది. బీహార్‌లో తేజస్వీ యాదవ్‌ తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముస్లిం-యాదవ్‌ల వ్యూహానికి తోడు బీసీల్లో అత్యంత వెనుకబడిన వార్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న పార్టీలను కలుపుకొని వెళ్తున్నారు. బీహార్‌లో కులగణన, రిజర్వేషన్ల అంశం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉన్నది అంటున్నారు. దీంతో బీజేపీ చాలా శ్రమిస్తున్నది.

మోదీ ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తేజస్వీ, లాలూ ప్రసాద్‌ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి అక్కడ పేరుకే బీజేపీ, జేడీయూ, ఎల్‌జేజీ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. కానీ మోదీ వాళ్లను పెద్దగా పట్టించుకోకుండా బీజేపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏకు మెజారిటీ కష్టమే అని ప్రచారం జరుగుతున్నది. ఇండియా కూటమి విజయం ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మే 25, జూన్‌ 1 న జరగబోయే (57+57) 114 స్థానాల పోలింగ్‌పై అందరిలో ఆసక్తి నెలకొన్నది.

Latest News