కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీల కలయిక
ఇండియా కూటమికి కలిసొచ్చే అంశం
మహారాష్ట్రలో సిట్టింగ్ స్థానాలు దక్కేనా
యూపీ, బీహార్, బెంగాల్‌లలో పట్టు నిలుపుకునేనా?
విధాత: లోక్‌సభ ఎన్నికల్లో 4 దశల పోలింగ్ ముగిసింది. ఐదో దశలో 8 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 49 స్థానాలకు మే 20న పోలింగ్ జరగనున్నది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌ను బట్టి, స్థితిగతులను బట్టి బీజేపీ మెజారిటీ మార్క్ దూరంగా ఉన్నదని, చివరికి ఎన్డీఏ కూడా మెజారిటీ దక్కపోవచ్చనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఈ ఐదో దశ ఇండియా కూటమికి ముఖ్యంగా బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, మహారాష్ట్రలో 13, ఒడిషా 5, యూపీలో 14, పశ్చిమ బెంగాల్‌లో 7, జమ్ముకశ్మీర్, లద్దాక్‌లలో ఒక్కో స్థానంలో ప్రజలు ఏ కూటమి వైపు ఉండబోతున్నరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ దశలపై ధీమా వ్యక్తం చేస్తూనే.. బీజేజీ 370 మార్క్ దాటుంది అంటూనే… ఎన్డీఏకు 400 సీట్లు ఖాయం అంటూనే కమలనాథుల్లో కలవరం మొదలైంది. ప్రధాని సహా, ఆ పార్టీ జాతీయ నేతల స్వరం మారుతున్నది.
కీలకమైన ‘మహా’ ఓటర్లు ఎటువైపు?
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో గత లోకసభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి ఏకంగా 41/ 48 సీట్లను గెలుచుకున్నది. ఇందులో బీజేపీనే సొంతంగా 23 చోట్ల విజయకేతం ఎగురవేసింది. అయితే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడమే కాదు, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు శివసేన, ఎన్సీపీలో సంక్షోభం నెలకొన్నది. ఇక్కడ ఉన్న 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు పోలింగ్ ముగిసింది.
మిగిలిన 13 స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనున్నది. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్‌పవార్ నేతృత్వంలోని (ఎస్పీ)లను ప్రధాని నకిలీవిగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల తర్వాత శివసేన, ఎన్సీపీలలో నకిలీవి ఏవో, అసలు పార్టీలు ఏవో ప్రజలు తేల్చనున్నారు. ప్రధాని వ్యాఖ్యలు చూస్తుంటే ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌లపై విశ్వాసం లేనట్టుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ, శిండే, అజిత్ పవార్ ల కూటమే. తమదే అసలైన కూటమి అన్న ఆ నేతలిద్దరూ ఇప్పుడు ప్రధాని ఛరిష్మాపైనే ఆధారపడే పరిస్థితి వచ్చిందంటున్నారు. శివసేన, ఎన్సీపీలో పార్టీల్లో చీలిక తర్వాత ఉద్ధవ్, శరద్ పవార్‌పై ప్రజల్లో సానుభూతి పెరిగింది అని నాలుగు దశల పోలింగ్ సరళిని బట్టి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే ఈ తుది అంకంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్ ముంబై నార్త్ నుంచి, మరో కేంద్ర మంత్రి కపిలప్ పాటి భీవండి, కల్యాణ్ నుంచి సీఎం ఏక్‌నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ షిండే, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ బరిలో ఉన్నారు. అందుకే ప్రధాని చివరి దశ పోలింగ్‌లో అయినా తన పట్టును నిలుపుకోవడం కోసం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉద్దవ్, పవార్‌లపై తీవ్ర విమర్శలు చేశారని అంటున్నారు.
ఇండియా కూటమికి కలిసొచ్చే అంశం
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవా ముందు కాంగ్రెస్ పార్టీనే తక్కువ సీట్లకే పరిమితం కావడం, ప్రాంతీయపార్టీల ఉనికి ప్రశ్నార్థమైంది. ప్రాంతీయపార్టీల్లో ఎక్కువ శాతం ఉద్యమాలు, స్థానిక రాజకీయ సమీకరణాల ఆధారంగా పుట్టుకొచ్చినవే. అలాంటి పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించినా, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మోడీని ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. పదేళ్లపాటు సుప్తచేతనావస్థలో ఉన్న ఆ పార్టీలలో యూపీలో ఎస్పీ, బీహార్‌లో ఆర్జేడీ, జార్ఖండ్‌లో జేఎంఎం, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌లు బాగా పుంజుకున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉండటం, బీజేపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా సాగుతుండటం కలిసి వచ్చే అంశం అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలు తలెత్తి బెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగిన తృణమూల్ అధినేత్రి మాట మార్చారు. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిలో తాను ముమ్మాటికీ భాగస్వామినేనని, ఇండియా కూటమిలో మేము భాగమే అన్నారు. అలాగే ఇండియా కూటమికి బైటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అబ్‌కీ బార్, 400 పార్ అనే నినదిస్తున్న బీజేపీకి ఇది మింగుడు పడని అంశం. ఎందుకంటే 400 సీట్లు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది రాజ్యాంగాన్ని మార్చడానికేనని, మోడీ మళ్లీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రస్తుతం ఉన్న రక్షణలు, హక్కులు ఉండని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రాంతీయపార్టీలు, కాంగ్రెస్‌పార్టీ ఈ అంశాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తున్నాయి.
దీంతో ఇబ్బందిపడుతున్న బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చబోమంటూ కండనలు, వివరణలు ఇస్తున్నారు. చివరికి మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అంటున్న మోడీ కొంత స్వరం మార్చి తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులున్నారని, చిన్నప్పడు తమ ఇంట్లో ఈద్ పండుగను నిర్వహించే వాళ్లమని, సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ బలంగా నమ్ముతానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదంతా యూపీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఉంటుందని, దీనివల్ల బీజేపీకి నష్టం జరుగుతుందనే గ్రహించే మోడీ స్వరం మార్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆ నాలుగు రాష్ట్రాల్లో సిట్టింగ్ స్థానాలైనా నిలబెట్టుకుంటుందా?
యూపీలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకుని కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయి. రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు స్వమన్వయంతో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 62 చోట్ల గెలిచిన బీజేపీకి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి సవాల్ విసురుతున్నది. జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ కూడా ఢిల్లీ, యూపీలలో ప్రచారం చేస్తున్నారు. ఇది మోడీకి మింగుడు పడని అంశం. అందుకే ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని, ఆయన బెయిల్ వచ్చారని, మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని అమిత్ షా సహా ఆపార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు.
ఈడీ కూడా కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేయాలన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీన్నిబట్టి ఇండియా కూటమి పట్ల ఎంత కలవరానికి గురవుతున్నారో తెలుస్తోంది. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలు అవుతుందని, యువరాజులు (అఖిలేవ్, రాహుల్‌లను ఉద్దేశించి) వేసవి విడిది పేరుతో విదేశాలకు వెళ్లిపోతారని ఎద్దేవా చేస్తున్నారు. ఐదు, ఆరు, ఏడు దశల్లో యూపీలో (14+14+13) 41 స్థానాలకు, బీహార్‌లో (5+8+ 8) 21 స్థానాలకు, బెంగాల్‌లో (7+8+9) 24, ఒడిషాలో ( 5+6+6) 17 పోలింగ్ జరగనున్నది. ఇక్కడ గతంలో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకోవడం కోసమే కమలనాథులు తీవ్రంగా కష్టపడుతున్నారు.
బీజేపీ 2019లో సొంతంగా గెలుచుకున్న 303 స్థానాలు గణనీయంగా తగ్గుతాయని, మెజారిటీ మార్క్‌ను చేరుకోలేదని, ఎన్డీఏ కూటమిని కలుపుకున్న కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలో తదుపరి దశల్లో మే 20, మే 25, జూన్ 1న జరిగే (49+57+57) 163 స్థానాల్లో ఎక్కువ సీట్లను దక్కించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యకు బీజేపీ చేరువ అయ్యే అవకాశం ఉన్నదనే రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు. అందుకే మోడీ సహా ఆ పార్టీ జాతీయ నేతలు చివరి దశల పోలింగ్‌లలో కాంగ్రెస్, ప్రాంతీయపార్టీలను టార్గెట్ చేస్తూ ఓటర్లను భయపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. బీజేపీ నేతలు వేస్తున్న ఈ ఫీట్లు ఎంత వరకు ఫలిస్తాయన్నది జూన్ 4న తేలుతుంది.