Mamunur Airport | విధాత, ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఏర్పడిన అడ్డంకులు క్రమంగా తొలిగిపోతున్నాయి. మొన్నటి వరకు రైతుల నుంచి భూ సేకరణకు నెలకొన్న పీటముడి తొలిగిపోయినట్లేనని భావిస్తున్నారు. రైతుల నుంచి సేకరించే వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.కోటి 20లక్షలు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ. 4,887 చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమస్య కొలిక్కివచ్చింది. దీంతో అధికారులు ఎయిర్ పోర్ట్ భూసేకరణపై స్పీడ్ పెంచారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రోడ్డు భవనాల శాఖ నుంచి మరోసారి రూ. 205 కోట్ల నిధులు విడుదలకు 23వ తేదీన జీవో జారీ చేశారు. గత నవంబర్ లో రూ.205కోట్లు విడుదల చేసింది. భూసేకరణ పనులు పూర్తయితే త్వరలో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం పట్టాలెక్కనున్నది.
696 ఎకరాలకు అదనంగా 253 ఎకరాల భూసేకరణ
మామునూరు పాత ఎయిర్‌పోర్టు పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉన్నది. నూతనంగా ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలంటే మరో 253 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించారు. ఈ భూమిని మామునూరు సమీపంలోని నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరు పల్లి గ్రామాలకు చెందిన 136 మంది రైతులు, స్థానికుల నుంచి మొత్తం 253 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 6134.5 చదరపు గజాల వ్యవసాయేతర భూమి, 12 కుటుంబాలకు చెందిన ఇండ్లను కోల్పోతున్నారు. వీటిని సేకరించేందుకు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు, ప్రస్తుతం మరో రూ.250 కోట్లు కేటాయించింది. ఇప్పటికే కేంద్ర విమానయానశాఖ రూ.450 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ సహకారం, అధికారులు, ప్రజాప్రతినిధుల శ్రద్ధకు తాజాగా భూములు కోల్పోతున్న రైతుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణ కల త్వరలో సాకారమవుతోందని భావిస్తున్నారు.
గాడిపల్లిలో గ్రామ సభ సక్సెస్
ఎయిర్‌పోర్టు నిర్మాణం సందర్భంగా కోల్పయే భూమికి ధర నిర్ణయించడంతో రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం గాడిపెల్లిలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఖిల వరంగల్ ఎమ్మార్వో పాల్గొన్నారు. నిన్నమొన్నటి వరకు ఈ భూమి సమస్యతోనే పనులు నిలిచిపోయాయి. భూములు కోల్పోతున్న సంబంధిత గ్రామాల రైతులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్ రావు తదితరులు చేసిన ప్రయత్నం ఫలించింది. వాస్తవానికి భూ సేకరణకు సంబంధించిన ధర నిర్ణయం ఎప్పుడో జరిగేదని, దీనిలో ప్రత్యర్ధి రాజకీయ నాయకుల జోక్యం వల్ల జాప్యం జరిగిందనే ఆరోపణలున్నాయి. రైతులకు ఎక్కువ ధర ఇప్పిస్తామని కొందరు ఆశచూపడం ఒక కారణమైతే, సహజంగానే నగర పరిధిలోని భూముల ధరలు భారీగానే ఉన్నందున భూములు కోల్పోయే రైతులు ఎక్కువ ధర ఆశించడం కూడా న్యాయమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పలు ధఫాలుగా జరిగిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో గాడిపల్లిలో గ్రామ సభ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. ఈ భూసేకరణ పనులు వచ్చే నెల 15వ తేదీ వరకు పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవ కానుక ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒకరో ఇద్దరురో రైతులు కోర్టుకు వెళితే ఆ పద్ధతుల్లోనే భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని అప్పగిస్తే వారు పనులు చేపట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎయిర్ పోర్టు అథారిటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్డంకులు లేకుంటే త్వరలో ఎయిర్‌పోర్టు పనులు అధికారికంగా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Mamnoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
World Biggest Airport | ప్రపంచంలోనే అదిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ను కట్టబోతున్న దుబాయి..!