Kaziranga Elephant Calf | “మాయాబిని” – కాజిరంగాలో పుట్టిన జీవం, ప్రేమ, ఆశకు కొత్త పేరు

కాజిరంగా నేషనల్‌ పార్క్‌లో పుట్టిన ఏనుగు పిల్లకు ‘మాయాబిని’ అని పేరు పెట్టారు. జూబిన్‌ గార్గ్‌ ప్రసిద్ధ గీతం ఆధారంగా ఈ పేరు పెట్టడం అడవిలో ప్రేమ, ఆశ, జీవం ప్రతీకగా నిలిచింది.

Kaziranga’s Elephant Calf Named ‘Mayabini’ After Zubeen Garg’s Song – A Symbol Of Hope And Harmony

Kaziranga’s Elephant Calf Named ‘Mayabini’ After Zubeen Garg’s Song – A Symbol Of Hope And Harmony

గువాహటి, అక్టోబర్‌ 5 (విధాత‌):
ప్రకృతి సొబగులతో అలరారే కాజిరంగా జాతీయ అరణ్యం నిన్న ఉదయం కొత్త శ్వాసతో మేల్కొంది. అక్కడ పుట్టిన బుల్లి ఏనుగు పిల్ల మొదటి అడుగులు వేస్తున్న క్షణం, పర్వతాల నిశ్శబ్దం చెదిరిపోయింది. ఆ ఏనుగు పిల్ల అరవడం – అటవీ గాలి తాకడం – కాజిరంగా అరణ్యం అంతా ఆనందంతో నిండిపోయింది. అదే క్షణంలో, ఆ చిన్న ఏనుగు పిల్లకు “మాయాబిని” (Mayabini) అనే పేరు పెట్టారు.

ఇది సాధారణ పేరు కాదు — అసోం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సంగీత మాంత్రికుడు జూబిన్‌ గార్గ్‌ పాడిన అమరగీతం పేరు. ఆ గీతం పేరు ఇప్పుడు అడవిలో పుట్టిన కొత్త జీవానికి ప్రతీకగా మారింది.

Mayabini : ‘కువారి’కి బిడ్డ పుట్టింది – కాజిరంగాలో ఉత్సాహం నిండింది

కాజిరంగా నేషనల్‌ పార్క్‌లో అత్యంత ప్రేమించే ఆడ ఏనుగుల్లో ఒకటి కువారి. ఇప్పటికే రెండుసార్లు పిల్లలకు జన్మనిచ్చిన కువారి, ఈసారి ఆరోగ్యవంతమైన ఆడ పిల్లకు జన్మనిచ్చింది. వన్యప్రాణి సిబ్బంది ఆ క్షణాన్ని “ప్రపంచ జంతు దినోత్సవం” సందర్భంగా పత్యక్షంగా చూశారు. ప్రతీ ఏడాది వేలాదిమంది సందర్శకులు వచ్చే కాజిరంగా నేషనల్​ పార్క్​ ఈసారి ఆ చిన్న ఏనుగు పిల్ల జన్మతో కొత్త కాంతిని సంతరించుకుంది.
అటవీ సిబ్బంది, స్థానిక గ్రామస్థులు, ప్రకృతి ప్రేమికులు – అందరూ ఆ పసికూన చుట్టూ ఆనందంతో గుమికూడారు. “ఆమె పుట్టినప్పుడు కువారి కళ్లలో మాతృత్వపు సంతోషం మెరిసింది” అని ఒక ఫారెస్ట్‌ గార్డ్‌ భావోద్వేగంతో చెప్పాడు.

ఇంతకీ  ‘మాయాబిని’ అంటే ఏమిటి?

‘మాయాబిని’ అనే పదం అస్సామీస్‌ మరియు బెంగాలీ భాషలలో “అద్భుతమైనది”, “దివ్యమైనది” అనే అర్థాలను సూచిస్తుంది. ఇది కేవలం ఒక పేరు కాదు – ప్రకృతిలోని  మాయాజాలానికి ప్రతీక. అస్సాం పర్యావరణ, అటవీ మరియు వాతావరణ శాఖ మంత్రి చంద్రమోహన్‌ పాటోవారీ సోషల్‌ మీడియా వేదిక X (Twitter)లో “#WorldAnimalDay నాడు మన ప్రియమైన కువారి ఆరోగ్యవంతమైన ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఆ చిరుజీవికి మేము ‘మాయాబిని’ అని పేరు పెట్టాము. ఇది అడవిలో కొత్త జీవం, ఆశ, సమతుల్యతకు ప్రతీక.” అని పోస్ట్​ చేసారు.ఈ ట్వీట్‌ క్షణాల్లోనే వైరల్‌ అయింది. జూబిన్‌ గార్గ్‌ అభిమానులు, ప్రకృతి సంరక్షకులు, సాధారణ ప్రజలు వేలాదిగా స్పందించి ఆనందం పంచుకున్నారు.

జూబిన్‌ గార్గ్‌ గీతం నుంచి అడవికి ప్రేమప్రవాహం

‘మాయాబిని’ పాటను అస్సాం సంగీత జంట జూబిన్‌ గార్గ్‌ మరియు కల్పనా పాటోవారీ పాడారు. ఆ పాట జూబిన్​ అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో ప్రేమ, సౌందర్యం, నిష్కళంకతకు ప్రతీకగా నిలిచింది ఆ గీతం. ఇప్పుడు ఆ పాట పల్లవి పదం ఒక ఏనుగు పిల్లకు పెట్టడం ఆ రాష్ట్ర ప్రజలకు గౌరవంగా, ఆనందంగా మారింది.

“సంగీతం మానవ హృదయాలను స్పృశిస్తుంది, కానీ మాయాబిని ఇప్పుడు అడవిలో పుట్టి ప్రపంచాన్నే స్పృశించింది.” అంటూ జూబిన్‌ గార్గ్‌ అభిమానులు X (Twitter)లో రాశారు.

 కాజిరంగా జాతీయ అరణ్యం  – జీవం ఊపిరి తీసుకునే అడవి

యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాజిరంగా నేషనల్‌ పార్క్‌, భారతదేశపు ప్రకృతి గౌరవానికి ప్రతీక. ఏనుగులు, రైనోలు, పులులు, జింకలు, పక్షులు, తాబేళ్లు – ఇక్కడ ప్రతి జీని స్వేచ్ఛగా కదలాడుతుంటుంది. అక్కడ పుట్టిన ప్రతి కొత్త ప్రాణి, ప్రకృతి చరిత్రలో కొత్త పేజీలా ఉంటుంది. “మాయాబిని” పుట్టుక కూడా అలాంటి ఓ కొత్త పేజీనే.

“ప్రతి ఏనుగు పిల్ల పుట్టుక కాజిరంగాకు కొత్త జీవం. కానీ ‘మాయాబిని’ పుట్టుక ప్రత్యేకం, ఎందుకంటే ఇది మనుషులకు, జంతువులకు మధ్య బంధాన్ని మరోసారి గుర్తు చేసింది.” అని ఒక అటవీ అధికారి అన్నారు.

జీవం, ఆశ, స్నేహం – అడవిలో ప్రతిధ్వనించే భావాలు

కాజిరంగా అడవిలో ఇప్పుడు మాయాబిని చుట్టూ చిన్న ఏనుగులు ఆడుకుంటున్నాయి. “ప్రకృతిని ప్రేమించడం అంటే ఇలాంటి క్షణాలు చూడగలగడమే.” అంటూ ఆ దృశ్యం చూసి ఆనందపరవశులైనవారు చెబుతున్నారు.

ఆ బుజ్జి ఏనుగు అడవిలో అమ్మ చుట్టూ సంతోషంగా తిరుగుతున్నప్పుడు, గాలి కూడా మృదువుగా వీచింది.
మరియు దూరంలో జూబిన్‌ గార్గ్‌ పాట పదాల్లా.. అడవి కూడా గుసగుసలాడింది.. “మాయాబిని… జీవం అందమైనది…”అంటూ..

Exit mobile version