భారత సరిహద్దు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ముళ్ల కంచె. సినిమాల్లో లేదా టీవీల్లో ఈ దృశ్యాలను మనం తరచూ చూస్తుంటాం. అయితే ఈ కంచెకు అక్కడక్కడ గాజు సీసాలు వేలాడదీసి ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా?

ఇవి చూడటానికి సాధారణంగా అనిపించినా, దేశ రక్షణలో ఇవి పోషించే పాత్ర చాలా కీలకం. మనకు వ్యర్థాలుగా కనిపించే ఈ సీసాలు.. సరిహద్దులో పహారా కాసే సైనికులకు మాత్రం ప్రాణాలను కాపాడే 'దేశీ అలారం'లా పనిచేస్తాయి.

ఎందుకు వాడుతారంటే?..: భారత సరిహద్దులు దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, మంచు ప్రాంతాల గుండా సాగుతాయి. అన్ని చోట్లా హైటెక్ సెన్సార్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఏర్పాటు చేసినా.. 

వర్షం, విపరీతమైన మంచు, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయకపోవచ్చు. కానీ ఈ గాజు సీసాలకు కరెంట్, బ్యాటరీ, నెట్‌వర్క్ అవసరం లేదు. ఇవి 24 గంటలు, ఎలాంటి వాతావరణంలోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయి.

జవాన్లు ఈ ఖాళీ సీసాలను ఒకదానికొకటి దగ్గరగా ఉండేలా ముళ్ల కంచెకు తాడుతో కడతారు. చీకట్లో ఎవరైనా చొరబాటుదారులు, ఉగ్రవాదులు లేదా వన్యమృగాలు కంచెను తాకినా, దాటేందుకు ప్రయత్నించినా.. 

తీగలు కదిలి ఈ సీసాలు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఆ సమయంలో వచ్చే 'టన్ టన్' అనే శబ్దం రాత్రి నిశబ్దంలో చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఈ శబ్దం వినగానే పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు.

ఖర్చు తక్కువ.. పనితనం ఎక్కువ లక్షల రూపాయల ఖరీదైన థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, లేజర్ అలారాలతో పోలిస్తే ఈ విధానం చాలా చవకైనది. ఖాళీ సీసాలు సులభంగా దొరుకుతాయి. 

వీటిని ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి పెద్దగా ఖర్చు ఉండదు. అందుకే సాంకేతికత అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.