సాధారణంగా చేపలు నీటిలో మాత్రమే బతుకుతాయి. నీటి నుంచి బయటకు వస్తే, కొన్ని నిమిషాల్లో, కొన్ని చేప జాతులు కొన్ని గంటల్లో చనిపోతాయి. కానీ కొన్ని రకాల చేపలు నీటితో పాటు నేలపైన కూడా జీవించేలా రూపాంతరం చెందాయి.

ముఖ్యంగా ఒక జాతి చేప అయితే జీవిత కాలంలో ఎక్కువగా నేలపైనే జీవిస్తుంది. ఇది నేలపై నడుస్తుంది, గాలిలో ఎగురుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ వెరైటీ చేప పేరు ‘మడ్ స్కిప్పర్’.

లంగ్ ఫిష్, ఈల్ క్యాట్ ఫిష్, గ్రునియన్ చేపలు నీటి బయట కాసేపు బతికి ఉండగలవు. అయితే మడ్ స్కిప్పర్స్ మాత్రం పూర్తిగా నేల మీద జీవించగలవు. ఇవి ఆఫ్రికా, దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాలోని మడ అడవులు, తీర ప్రాంతాలు, చిత్తడి నేలల్లో కనిపిస్తాయి.

చేపలు కంటి రెప్పలు ఆర్పలేవు. కానీ మడ్ స్కిప్పర్స్ కనురెప్పలు ఆర్పగలవు. వీటి సహాయంతో చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడగలవు. నేలపై ఉన్నప్పుడు రెప్పలు ఆర్పుతూ  కళ్లను తడిగా ఉంచుకుంటాయి, దుమ్ము పడకుండా చూసుకుంటాయి.

మడ్ స్కిప్పర్స్ చేపల శరీరానికి కింది భాగంలో ఉండే రెక్కలను కాళ్లలా ఉపయోగిస్తాయి.  వీటి సహాయంతో ఇవి నీటీలో ఈదుతాయి, నేలపై నడుస్తూ గెంతుతాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. వీటికి భుజాలు, మోచేతుల వంటి కీళ్లు కూడా ఉంటాయి.

అందుకే ఇవి శరీరాన్ని పైకి లేపి ముందుకు నెట్టగలవు. ఈ చేపలు గాలిలోకి ఎగురుతాయి కూడా. ఇవి తమ తోకను 'C' ఆకారంలో వంచి, నేలకు కొట్టి ఒక్కసారిగా గాలిలోకి ఎగరగలవు. అలాగే నేల మీద ప్రయాణించడానికి కూడా ఈ టెక్నిక్ వాడుకుంటున్నాయి.

సాధారణంగా చేపలు మొప్పల ద్వారా శ్వాస తీసుకుంటాయి. కానీ మడ్ స్కిప్పర్ జాతి చేపలు మాత్రం చర్మం ద్వారా లేదంటే నోరు, గొంతు లోపలి భాగం ద్వారా గాలిలోని ఆక్సిజన్‌ను డైరెక్ట్‌గా గ్రహిస్తాయి. వీటికి ఆక్సిజన్ అందాలంటే చర్మాన్ని ఎప్పుడూ తడిగా ఉంచుకోవాలి.

అందుకే ఇవి బురదలో దొర్లుతూ, నీటి గుంటలలో ఆడుతూ కనిపిస్తాయి. మడ్ స్కిప్పర్స్ మొప్పల గదులలో నీటిని నింపుకుంటాయి. నేలపై ఉండే సమయంలో ఈ నీటిలోని ఆక్సిజన్‌ను వాడుకుంటాయి. ఆక్సిజన్ కోసం ఇవి బురద నీటిని కూడా నోటితో పీల్చుకుంటాయి