మీరు ఎప్పుడైనా ఆలయంలో లేదా పెయింటింగ్‌లో హిందూ దేవుళ్లను చూసినప్పుడు ఓ డౌట్‌ తప్పకుండా వచ్చే ఉంటుంది. చాలామంది దేవతా మూర్తులకు రెండు కంటే ఎక్కువ చేతులు ఉంటాయి.

కొందరికి నాలుగు, కొందరికి ఎనిమిది లేదా పది చేతులు ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి? అని ఆలోచిస్తే పురాణాల్లో వివరణ ఉంటుంది. ప్రతి దాని వెనుక ఓ అర్థం, పరమార్థం ఉంటుంది.

హిందూ ఫిలాసఫీ ప్రకారం.. దైవత్వాన్ని పూర్తిగా పదాలలో వివరించలేం. కాబట్టి లోతైన ఆలోచనలను తెలియజేయడానికి ఇమేజెస్‌, సింబల్స్‌ యూజ్‌ చేస్తుంది. దేవుళ్లు భౌతికంగా అలా కనిపిస్తారని చెప్పడానికి ఎక్కువ చేతులు చూపించలేదు.

అవి వారి సామర్థ్యం, శక్తులను సూచిస్తాయి. ఒక మానవుడికి రెండు చేతులు ఉంటాయి, ఒకేసారి పరిమితమైన పనులు చేయగలడు. అయితే దైవానికి ఒకేసారి అనేక పనులు చేయగల సామర్థ్యం ఉంటుందని చెప్పడమే ప్రధాన లక్ష్యం.

దుర్గాదేవి ఉదాహరణను తీసుకోండి. ఆమెను ఎనిమిది లేదా పది చేతులతో చూపిస్తారు. ప్రతి చేతిలో ఒక ఆయుధాన్ని కలిగి ఉంటుంది. ఇది హింసకు సూచన కాదు.

ప్రతి ఆయుధం ధైర్యం, స్పష్టత, ఓర్పు, బలం లేదా జ్ఞానం వంటి గుణాలను సూచిస్తుంది. రాక్షసులను ఓడించడానికి, భక్తులను కాపాడటానికి అవసరమైన అన్ని సాధనాలు ఆమె వద్ద ఉన్నాయని అవి చూపుతాయి.

విష్ణువు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తాడు. స్వామి చేతుల్లో శంఖం (పవిత్ర శబ్ధం, మేల్కొలుపుకు చిహ్నం), చక్రం (మనస్సు, విశ్వ క్రమానికి చిహ్నం), గద (బలం, క్రమశిక్షణకు చిహ్నం), కమలం (స్వచ్ఛత, ప్రశాంతతకు చిహ్నం) ఉంటాయి.

వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఇవి కేవలం వస్తువులు కాదు. అవి కనిపించే ఆలోచనలు. విష్ణువు నాలుగు చేతులు నాలుగు దిక్కులను (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం) సూచిస్తాయి. అంటే ఆయన సర్వవ్యాపి, విశ్వమంతా నిండి ఉన్నాడని దీని అర్థం.

నటరాజు రూపంలో శివుడు చాలా చేతులతో ఉంటాడు. ఒక్కో చేయి ఒక్కో చర్యను చూపుతుంది. ఒక చేయి సృష్టిస్తుంది. మరొక చేయి రక్షిస్తుంది. మరొకటి నాశనం చేస్తుంది. మరొక చేయి స్వేచ్ఛను అందిస్తుంది. 

ఇది లోతైన ఆలోచనలను చెబుతుంది.  జీవితం అంత సులువు కాదు. సృష్టి, విధ్వంసం కలిసే పుడతాయి. మొదలు, ముగింపు ఒకేసారి మొదలవుతాయి అని చెబుతుంది.