అమరావతి : పెన్ను, పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థుల చేతులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు నిర్వాకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి (మం), బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు దర్జాగా ఓ కుర్చీలో కూర్చుని తాను సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్ధినిలతో కాళ్లు నొక్కించుకుంటున్న దృశ్యాల వీడియో బయటకు వచ్చింది.
ఉపాధ్యాయురాలి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఈ విధంగా అనైతిక చర్యలకు పాల్పడటం ఉపాధ్యాయ వృత్తికే మచ్చ వంటిదంటూ మండిపడుతున్నారు. కాగా ఈ ఉదంతంపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్పందించారు. సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశామని, శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు.
