న్యూఢిల్లీ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన కలచివేసిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. శనివారం కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. రెయిలింగ్ ఊడి పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుందని, ఘటనాస్థలంలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలు కాగా.. పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
