విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Municipal Elections | చేతులుకాలే పరిస్థితులు తలెత్తడంతో జ్ఞానోదయమైన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆకులు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఏడింటిని కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకున్నారు. హంగ్ ఏర్పడిన నాలుగు స్థానాలను హస్తగతం చేసుకోవడంతోపాటు బీఆర్ఎస్‌కు మెజారిటీ వచ్చిన తొర్రూరు స్థానంపై కన్నేశారు. చేజారిపోతాయని భావించిన ఐదు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు అవసరమైన పావులు చకచకా కదుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే గట్టిపట్టుదలతో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా.. గెలిచిందనుకుంటున్న తొర్రూరును కూడా కైవసం చేసుకునేందుకు ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్క రోజులో రాజకీయ పరిస్థితులను, ఆధిపత్యాలను తారుమారు చేసేందుకు అవసరమైన కౌన్సిలర్లను తమ బుట్టలో వేసుకునేందుకు తెరవెనుక కార్యక్రమాలను పరిపూర్తి చేయడంలో నేతలు, ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. అధికార పార్టీ కావడంతో ఉన్న సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఎత్తులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా సర్వశక్తులొడ్డుతున్నారు. కాంగ్రెస్ ఎత్తుగడలకు ఏ మాత్రం తీసిపొకుండా తమకు మెజారిటీ ఉన్న మున్సిపాలిటీల్లో జెండాపాతేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
వరంగల్ పై పట్టుకు కాంగ్రెస్ కసరత్తు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకుగానూ ఏడింట కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలుపొందడంతో కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయాయి. అయినప్పటికీ ప్రత్యర్దులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకు అవసరమైన జాగ్రత్తలతోపాటు క్యాంపులకు తరలించారు. ఇక మిగిలిన ఐదింటిలో నాలుగు స్థానాలు హంగు, ఒక స్థానంలో బీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. ఈ ఐదింటి పైన కాంగ్రెస్ కన్నువేసింది.
ఎర్రబెల్లికి ఎక్స్ అఫిషియోతో చెక్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో రెండు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పైన గెలిచింది. తొర్రూరులో 16 వార్డులుండగా బీఆర్ఎస్ 9 స్థానాలను, కాంగ్రెస్ 7 స్థానాలను గెలిచింది. రెండు ఓట్లతో బీఆర్ఎస్ గెలిచినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ స్థానాన్ని కూడా అంత సులభంగా బీఆర్ఎస్ కు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడం తాజా పరిణామం. ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాట్లను చైర్మన్ ఎన్నికకు ముందే సరిదిద్దుకుని పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. దీని కోసం ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పాలకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటుతోపాటు వరంగల్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో తొర్రూరు ఉన్నందున వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటును ఇక్కడ వినియోగించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. దీని వల్ల బీఆర్ఎస్, కాంగ్రెస్లకు చెరి 9 ఓట్ల చొప్పున సమానమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చైర్మన్ ఎన్నిక టైగా మారే అవకాశం ఉంది. దీంతో టాస్ కు వెళుతారా? ఎమ్మెల్సీ సారయ్య ఓటును ఇక్కడ వినియోగించి గెలుస్తారా? లేదా బీఆర్ఎస్ శిబిరం నుంచి ఎవరికైనా గాలం వేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరపరిణామంగా మారింది.
హంగులన్నీ హస్తగతానికి ప్లాన్
హంగు వచ్చిన నాలుగు స్థానాలను దక్కించుకునేందుకు ప్లాన్లు అమలు చేస్తున్నారు. మహబూబాబాద్ లో 36 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 12, సీపీఐకి 3, సీపీఎంకు 3, బీజేపీకి 1, ఇండిపెండెంట్లకు 4 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ కు సీపీఎంకు చెందిన ముగ్గురి మద్ధతు ఉన్నందున 16కు చేరారు. బీఆర్ఎస్ కు సీపీఐ మద్ధతు ఉన్నందున 15కు చేరారు. దీంతో నలుగురు ఇండిపెండెంట్లు, బీజేపీ కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఇండిపెండెంట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వేట కొనసాగించింది. ఈ ప్రయత్నం ఫలించి ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్లో చేరారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఎక్స్అఫిషియో మెంబర్ గా ఓటు తోడు కావడంతో కాంగ్రెస్ బలం 20కి చేరింది. బీఆర్ఎస్ కున్న 12 స్థానాలు, 3 సీపీఐ మద్ధతుతోపాటు మిగిలిన ఇండిపెండెంట్, బీజేపీ సభ్యుడి సహకరించి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపెల్లి రవిందర్ రావు ఓటు వినియోగించినా బలం 18 కే చేరుతోంది. దీంతో కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని దక్కించుకున్నట్లేనంటున్నారు. ఇక కేసముద్రంలో 16 వార్డులకు కాంగ్రెస్ కు 8, బీఆర్ఎస్ కు 8 స్థానాలు లభించాయి. ఇక్కడ మహబూబాద్ ఎంపీ బలరామ్ నాయక్ ఓటును వినియోగించుకుని ఈ స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్లాన్ వేశారు. వర్ధన్నపేటలో 12 స్థానాలకు బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. ఇప్పటికే ఇండిపెండెంట్ ను కాంగ్రెస్ తమ శిబిరంలో చేర్చుకుని ఓట్లు సమానం చేసుకోగా, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ గట్టెక్కనున్నట్లు సమాచారం. ఇక మిగిలిన జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఎం పొత్తు ఉన్నందున కాంగ్రెస్ బలం 13కు చేరింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు బీఆర్ఎస్ కావడంతో ఆ పార్టీ బలం 14కు చేరుతోంది. ఇక్కడ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటును కాంగ్రెస్ వినియోగిస్తుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఓటును, కాంగ్రెస్ బస్వరాజు సారయ్య ఓటును ఎక్కడ వినియోగించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన ఇక్కడ ఇండిపెండెంట్లే కీలకం కానున్నారు. దీని కోసం ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Read Also |
Thermobaric Bombs | ఆ బాంబు పేలితే.. మనిషి క్షణాల్లో బూడిదే.. ! గాజాలో ఆనవాళ్లు!
ప్రతి పక్షంలో కాంగ్రెస్ గెలిచినదానికంటే ఎక్కువే గెలిచాం : కేటీఆర్
Jagitial Municipal Elections : ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను నలిపేశారు..జగిత్యాలలో రెబెల్స్ హవా
