రైతు సదస్సుకు ముందే బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సవాళ్లు

ఈ నెల 6వ తేదీన హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు సదస్సకు ముందు నుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు రాజకీయ సవాళ్ళు విసురుకుంటున్నారు. రైతుల సమస్యలు కేంద్రంగా రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇదే సందర్భంలో వరంగల్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం ఏం చేసేందో ఏకరువుపెడుతున్నారు. పనిలో పనిగా పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

  • By: TAAZ |    telangana |    Published on : May 01, 2026 9:33 PM IST
రైతు సదస్సుకు ముందే బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సవాళ్లు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ఈ నెల 6వ తేదీన హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు సదస్సకు ముందు నుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు రాజకీయ సవాళ్ళు విసురుకుంటున్నారు. రైతుల సమస్యలు కేంద్రంగా రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇదే సందర్భంలో వరంగల్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం ఏం చేసేందో ఏకరువుపెడుతున్నారు. పనిలో పనిగా పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్‌లో సభ నిర్వహిస్తున్నారంటూ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో జిల్లా అభివృద్ధి అంశాలు కూడా ఇప్పుడు చర్చల్లో ప్రధాన భాగమవుతున్నాయి.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ ప్రకటించిన మే 6న రైతు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సభ, తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించి, చివరికి రైతు సదస్సు జరపాలని తీర్మానించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

కాంగ్రెస్ హయంలో రైతులకు అన్యాయం: బీఆర్ఎస్

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూధనాచారి, ఆ పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తక్కెళ్ళపెల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి… రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో రైతులకు పండుగ ఏర్పడితే కాంగ్రెస్ ఎండుగగా మార్చిందంటూ ఆరోపిస్తున్నారు. రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొట్టే రోజులు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదంటూ కోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

రైతులను వంచించించిన బీఆర్ఎస్ : కాంగ్రెస్

పదేళ్ళు అధికారంలో ఉండి కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచిందంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఒక్క మేలు కూడా చేయని బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని వరంగల్ లో సభ పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేయడమే కాకుండా రెండు లక్షల రుణమాఫీ, రూ.6వేల చొప్పున రైతు భరోసా, పంట నష్టపరిహారం, రూ. 500 బోనస్ అమలు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ విమర్శిస్తున్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్ళు చేయకపోవడంతో అనేక మంది రైతులు కల్ళాల్లోనే మృతి చెందిన సంఘటనలు అప్పుడే బీఆర్ఎస్ నాయకులు మరిచిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

తెరపైకి వరంగల్ జిల్లా అభివృద్ధి

రైతు సదస్సు నేపథ్యంలో రైతుల సమస్యల, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన కృషితో పాటు రైతుల ఇబ్బందులను నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ సభలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీతక్క కూడా ఉన్నారని, ఆమె సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తుండగా, రైతు సమస్యలతోపాటు, వరంగల్ జిల్లా అభివృద్ధికి ఎవరేం చేశారో తేల్చుకుందామంటూ కాంగ్రెస్ నేతలు కొత్త చర్చను ప్రారంభించారు. తాజాగా ఇదే అంశాన్ని ఎమ్మెల్యే నాయిని లెవనెత్తారు. వరంగల్ వరద ముంపునకు గురైతే ఇంటికి పది వేలు ఇస్తామని ప్రకటించిన కేటీఆర్ ఎక్కడికి పోయారని, రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఎన్నికల్లో హనుమకొండ, వరంగల్ ఎమ్మెల్యేలుగా వినయ్, సురేఖలను గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేస్తామని చెప్పిన కేటీఆర్, కేసీఆర్ మాటలెక్కడికి పోయాయని ప్రశ్నించారు. వరంగల్ అభివృద్ధిని పట్టించుకోకపోగా, తీవ్ర నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పదేండ్లు ఎయిర్ పోర్టు, కాజీపేట రైల్వే అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఏటా రూ.300 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పదేండ్లు దోస్తీ చేసి వరంగల్ ను పట్టించుకోలేదని, ఇప్పుడు మేం అభివృద్ధిచేస్తుంటే ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక కేంద్రమంత్రి సంజయ్ మొన్న నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి శవంతో రాజకీయం చేసే ప్రయత్నించారని విమర్శించారు. నాయిని విమర్శలకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారోనని భావిస్తున్నారు.