హైలైట్స్:
- ఎస్ఐఆర్ అవగాహన కోసం కేడర్ వద్దకు
- అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు
- పెరిగిన రాజకీయ దూకుడు
- సడన్‌గా రేగిన రాజకీయ వేడి
- పనిలోపనిగా పరస్పర ఆరోపణలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
రాష్ట్రస్థాయిలో జరిగే కార్యక్రమాలు, కేంద్ర కార్యాలయాలకు పరిమితమైన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా నేలకు దిగివస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పనిచేసే ముఖ్య కేడర్‌ను కలుస్తున్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో సర్వం ధారపోసే కార్యకర్తల పరిస్థితిని ఆరా తీస్తున్నారు. నిన్నటి వరకు ముఖం చాటేసిన ఆయా పార్టీల ఎమ్మెల్యేలూ, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు పునాదిరాళ్ళుగా భావించే కేడర్‌తో ములాఖతవుతున్నారు. మంచీ.. చెడులు ముచ్చటపెడుతూ.. మీరే మా అధికార కోటలకు పునాదులంటూ మళ్ళీ ఉత్తేజకర ఉపన్యాసాలిస్తున్నారు. తిరిగి పార్టీని గాడిలో పెట్టే పనిని చేస్తున్నారు. పనిలో పనిగా గత ఎమ్మెల్యేలూ, ఇంచార్జ్లు చేసిన తప్పులను ‘కడుపు’లో పెట్టుకోవాలని బోధిస్తున్నారు. పార్టీ కన్నతల్లిలాంటిదని, అధికారం లేకపోతే ఆగమయ్యే తీరును గుర్తు చేస్తూ ‘నచ్చ’చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీపడి ఈ సమావేశాలు నిర్వహించడంతో రాష్ట్రమంతా రాజకీయ జాతర వాతావరణం నెలకొంది.
ఎస్ఐఆర్ తో రాజకీయ పక్షాల్లో చలనం
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో చలనం తెచ్చింది. ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టిన రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని కోల్పోయాయనే ఆరోపణలున్నాయి. చివరికి సీఎం స్థాయి అభ్యర్ధులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి బడా నేతలు ఎమ్మెల్యేలుగా కూడా గెలువలేకపోయారనే చర్చసాగుతోంది. ఎస్ఐఆర్ అధికార బీజేపీకి అనుకూల ప్రక్రియ అనే విమర్శలు ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తుండగా ఇదంతా తప్పుడు ప్రచారమంటూ బీజేపీ ఖండిస్తోంది. తాజాగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో కూడా ప్రారంభం కావడంతో ప్రధాన విపక్ష రాజకీయ పక్షాల్లో ఆందోళనతో పాటు అప్రమత్తత పెరిగింది. ఈ నేపథ్యంలో ‘ఓట్ల చోరీ’ని నిరోధించాలంటే బూత్ స్థాయిలో పార్టీ నాయకులను అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇష్టమున్నా.. లేకున్నా… అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో తమ కు అనుకూల ఓటు ‘చోరీ’ కాకుండా అడ్డుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. దీని కోసం కేడర్‌ను రక్షకులుగా తీర్చిదిద్దేందుకు నాయకులు నేలకు దిగిరాకతప్పలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ పై అవగాహన పెంచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో మూడు పార్టీల రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
కేడర్‌కు భరోసా కల్పించే యత్నం
ఇప్పుడు గెలిచిందీ….మనమే… వచ్చే సారి గెలిచేదీ మనమే అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే, గెలిచిన పార్టీ నాయకులు… ఆ నియోజకవర్గ కేడర్ కు మరోసారి భరోసా ఇస్తుండగా, మొన్నటి ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఓటమిపాలైనప్పటికీ … రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేదీ మనమే అంటూ ఓటమిపాలైన పార్టీ నాయకులూ కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. పట్టణాల్లో వార్డులు, డివిజన్ లో పనిచేసే నాయకులకూ, గ్రామ స్థాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ నాయకులు పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించి ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో భాగస్వామ్యమవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాల్లో తలమునకలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక పెరిగింది. మూడు పార్టీలు పోటీలు పడి నియోజకవర్గ స్థాయి మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్యే ఆశావహులూ, మాజీ ఎమ్మెల్యేలూ, పార్టీ నియోజకవర్గ ఇంచార్జులు ఒక్కడుగు ముందుకు వేసి క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ వల్ల జరిగే పొరపాట్లు, తప్పులను సవరించుకుంటూ బుజ్జగింపులు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో సొంత పార్టీలో పోటీ తీవ్రంగా ఉంటే ఈ పరుగుపందెంలో వెనుకబడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిన్నటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కేడర్ కూ, రాష్ట్ర నాయకులకు మధ్య తెగిన పార్టీ లింక్ మళ్ళీ క్రమంగా బలపడుతోంది. పార్టీ కార్యక్రమాల్లో కేడర్ భాగస్వామ్యం పెరుగుతూ నెమ్మదిగా యాక్టివ్ అవుతున్నారు.
రాజకీయ విమర్శలు, దూషణలు
క్షేత్రస్థాయిలో కేడర్ తో జరిగే సమావేశాలకు మూడు పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నందున సాధారణంగానే అటెన్షన్ పెరుగుతోంది. ఈ ముఖ్యనాయకుల రాజకీయ ఉపన్యాసంలో ఎదుటి పక్షం పైన విమర్శలూ, రాజకీయ దాడిని కొనసాగిస్తున్నారు. దీనికి ప్రతిగా ప్రత్యర్ధి పార్టీ నేతలు ఎదురుదాడి చేయడంతో రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్రంతో పాటు నియోజకవర్గ స్థాయిలో కూడా స్థానిక నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఇరుపార్టీల కేడర్ లో ఉత్సాహాం పెరుగుతోంది.
తమ హయంలో, తమ ప్రభుత్వ హయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల గురించి ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులూ, నాయకులు ఏకరువుపెడుతూ అధికార కాంగ్రెస్ పై విరుచుకపడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి అంశాలను వివరిస్తున్నారు. బీజేపీ నాయకులు కేంద్రంలో మోదీ నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధిని వివరిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారంటూ విరుచుకపడుతున్నారు. నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సభలు నిర్వహించి సీఎంరేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన రాజకీయ దాడి చేశారు. దీనికి ప్రతిగా ఆయా పార్టీల నాయకులు కూడా విమర్శలు చేశారు. ఈ రాజకీయ వేడి ఇంకా చల్లారకముందే నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు, ప్రతిసవాళ్ళ స్థాయి దాటి పరుష పదాలు, దూషణలు సైతం చేసుకుంటున్నారు.