అమరావతి : తమ సాహస ప్రదర్శనలతో ప్రఖ్యాతి పొందిన అనంతపురం జిల్లా తాడిపత్రి సోదరులు లక్కీ, విక్కీ మరో అద్భుత సాహస ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరిచారు. గిన్నీస్ బుక్ లక్ష్యంగా వారు నిర్వహించిన ఈ సాహస ప్రదర్శన వైరల్ గా మారింది. లక్కీ చేతుల పైనుంచి 100 కార్లు, విక్కీ శరీరం పైనుంచి 100 బైక్‌లు వరుసగా వెళ్లేలా విన్యాసాలు చేశారు.

గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా అయాన్‌ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో ఈ చిన్నారి సోదరులు ఇద్దరూ.. ఈ సాహస ప్రదర్శన నిర్వహించారు. లక్కీ, విక్కీ ఇప్పటికే తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. తమ తదుపరి లక్ష్యం గిన్నీస్ బుక్ రికార్డు అని ప్రకటించారు. ఈ చిన్నారులు గత కొన్ని నెలలుగా నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో కఠినమైన తైక్వాండో, శారీరక దృఢత్వ శిక్షణ తీసుకున్నారు.

ప్రదర్శన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన భద్రతా ప్రమాణాలను మరియు వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. ఈ చిన్నారుల ప్రతిభను, తైక్వాండో అకాడమీ శిక్షకులను స్థానిక ప్రజలు, క్రీడాకారులు ఎంతగానో అభినందిస్తున్నారు.