విధాత: ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(57) (ఆళ్ల నాని) కన్నుమూశారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 2019లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో నాని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా 2019 నుంచి 2022 వరకు బాధ్యతలు నిర్వహించారు. డిసెంబర్, 30, 1969లో ఏలూరులో సూర్య చంద్రరావు, నాగమణి దంపతులకు జన్మించారు. పదోవ తరగతి వరకు ఏలూరు కేపీ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత సర్ సీఆర్ ఆర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ చదివి, డిగ్రీ ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశారు.
నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో 1994లో ప్రారంభమైంది. 1994, 1999లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో గెలిచిన నాని ఆ తర్వాత జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో కార్యకర్తల ఒత్తిడి మేరకు 2025లో వైసీపీని వదిలి ఆ పార్టీలో చేరారు. వివాదాలకు దూరంగా ఉండే నాని మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.