గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. దేశంలోని 36 ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆదాయాలు 2024–25లో 51శాతం తగ్గిపోయాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) తాజా నివేదిక పేర్కొంటున్నది. వీటిలో 21 పార్టీలు.. ప్రకటించిన ఆదాయాలకంటే ఖర్చులు అధికంగా ఉండటం గమనార్హం. ఏడీఆర్ తన తాజా నివేదికను మే 27, 2026న విడుదల చేసింది. దేశంలోని మొత్తం 67 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు గాను 36 పార్టీల ఖాతాలను ఆడిట్ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ యా రాజకీయ పార్టీలు సమర్పించిన ఆడిట్ వివరాలను క్రోడీకరిస్తూ ఏడీఆర్ నివేదికను తయారు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఆడిట్ రిపోర్టులు సమర్పించేందుకు అక్టోబర్ 31, 2025 గడువు. కానీ.. 31 పార్టీలు మాత్రం గడువు దాటిపోయి 207 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆడిట్ రిపోర్టులను సమర్పించలేదు.
ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,192.94 కోట్ల రూపాయలుగా ఉన్నది. అంతకు ముందు ఏడాది 2023–24లో ఇది రూ.2,463.17 కోట్ల రూపాయలుగా ఉన్నది. అంటే.. రూ.1,270.23 కోట్లు (51.57%) తగ్గింది. అదే సమయంలో ఈ పార్టీల మొత్తం వ్యయం రూ.1,433.07 కోట్లుగా ఉన్నది. అంటే.. వారి ఆదాయానికి మించి రూ.240.12 కోట్లు.
ఈ పార్టీల్లో టాప్ ఐదు ప్రాంతీయ పార్టీలు దాదాపు 69శాతం ఆదాయాన్ని, 77 శాతం ఖర్చును కలిగి ఉన్నాయని ఏడీఆర్ విశ్లేషణ తెలిపింది.
హైలైట్స్:
- ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ రూ.228.31 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. అంటే మొత్తం పార్టీల ఆదాయాల్లో టీడీపీ ఆదాయమే 19.14% ఉంది. తదుపరి స్థానంలో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ రూ.219.35 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఏపీలోని వైసీపీ రూ.140.39 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.
- ఖర్చుల విషయానికి వస్తే.. వైసీపీ అత్యధికంగా 340 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రకటించింది.
- తరువాతి స్థానంలో బిజు జనతాదళ్ రూ.288.44 కోట్లు,
- ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ రూ.227.59 కోట్లు ఖర్చు చేశాయి.
- 36 ప్రాంతీయ పార్టీల్లో 21 పార్టీలు ఆదాయానికి మించి ఖర్చులు చూపాయి.
- వైసీపీ తన ఆదాయానికంటే 199.82 కోట్లు ఖర్చు చేసింది.
- తృణమూల్ కాంగ్రెస్, బీఆరెస్, బీజేడీ, జేడీయూ, సమాజ్‌వాది పార్టీ సైతం ఆదాయానికి మించి ఖర్చులు చూపాయి.
స్వచ్ఛంద విరాళాలే ప్రాంతీయ పార్టీలకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో 58.88 శాతం (రూ.702.36 కోట్లు విరాళాలు, డొనేషన్ల రూపంలోనే వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యధికంగా 184.08 కోట్ల విరాళాలు వచ్చాయి. వైసీపీకి 140.05 కోట్లు, టీడీపీకి 85.20 కోట్లు వచ్చాయి. ఖర్చుల్లో అత్యధిక భాగం ఎన్నికలకే కేటాయించాయని ఏడీఆర్ విశ్లేషణ తెలిపింది. 15 పార్టీల వివరాలను గమనిస్తే.. వాటి మొత్తం ఆదాయంలో 55 శాతాన్ని ఎన్నికల ఖర్చులకే వెచ్చించాయి. ఎన్నికల క్యాంపెయిన్ కోసం వైసీపీ రూ.299.92 కోట్లు ఖర్చు చేసినట్టు చూపింది. తదుపరి స్థానాల్లో బీజేడీ (రూ.270.66 కోట్లు), బీఆరెస్ (రూ.147.99 కోట్లు) ఉన్నాయి.
ఆడిట్ రిపోర్టులు సమర్పించడంలో పలు రాజకీయ పార్టీలు తీవ్ర జాప్యం చేసిన విషయాన్ని ఏడీఆర్ నివేదిక ప్రస్తావించింది. 15 పార్టీలు సమయానికి రిపోర్టులు సమర్పించగా, 21 పార్టీలు 2 రోజుల నుంచి 96 రోజులు జాప్యం చేశాయి. ఈ నివేదిక రూపొందించే సమయానికి 2024–25 ఆడిట్ రిపోర్టులను డీఎంకే, శివసేన, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, జేకేఎన్‌సీ తదితర పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించలేదని పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్
అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.82.46.. రూ.100 లోపు దొరికే ప్రాంతాలు ఇవే..
మొన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాజకీయ రుతుపవనం తెలంగాణనూ తాకేనా? రేవంత్ వద్ద ‘ప్లాన్ బీ’ ఉందా?