హైలైట్స్:
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి విజ్జప్తి
తెలంగాణలో CPS నుంచి OPSకు ఉద్యోగులు మారేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం (13న) జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.53 ద్వారా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (OPS)లోకి మారేందుకు అవకాశం కల్పించింది.
ఏపీ తరహాలో తెలంగాణలోనూ CPS నుంచి OPSకు ఉద్యోగులు మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో తేవాలని లచ్చిరెడ్డి కోరారు. ఇదే కాకుండా ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ ఓపీఎస్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబరు 1, 2004కు ముందు నియామక నోటిఫికేషన్ లేదా ప్రకటన వెలువడిన పోస్టులకు చాలా మంది ఎంపికయ్యారని చెప్పారు. అయినప్పటికీ వీరంతా కూడా సీపీఎస్‌లోనే ఉన్నట్టుగా గుర్తు చేశారు. ప్రస్తుతం CPS పరిధిలో ఉన్న ఉద్యోగులందరికీ OPSను ఎంచుకునే వీలు కల్పించాలని కోరారు.
2004 సెప్టెంబర్‌కు ముందు నోటిఫికేషన్‌ల ఆధారంగా ఎంపికై, CPSలో చేరిన వేలాది మంది ఉద్యోగులకు OPSలోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ జీ.ఓను విడుదల చేయాలని కోరారు. దీంతో ఎంతో మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా చెప్పారు.