ఉద్యమకారుల శాశ్వత రక్షణకు కమిషన్

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో పలువురు ఉద్యమకారులు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. చట్టబద్ధ హోదా, జీవిత కాల పెన్షన్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వారి పిల్లలకు ఉచిత విద్య, 250 గజాల ఇంటి స్థలం తదితర డిమాండ్లు చేశారు. వాటిపై కమిటీ సానుకూలంగా స్పందించింది.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Edited by: విధాత తెలంగాణ డెస్క్ | Jul 13, 2026, 8:08 pm IST
Read Time: 6 mins
ఉద్యమకారుల శాశ్వత రక్షణకు కమిషన్

హైలైట్స్:

  • విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్
  • ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతి నెలా పెన్షన్
  • సానుకూలంగా స్పందించిన ఉద్యమకారుల కమిటీ

విధాత, హైదరాబాద్‌:

స్వరాష్ట్ర సాధనలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఉద్యమకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కొనియాడారు. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జరిగిన చారిత్రాత్మక ఆందోళనలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి ఇక్కడివారు వెన్నుముకగా నిలిచారన్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక చిహ్నంలో సోమవారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. జిల్లాల ప్రతినిధులు, ఉద్యమకారులు తమ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును రక్షించాలని కోరుతూ కమిటీ ముందు ఈ క్రింది ప్రధాన సంక్షేమ డిమాండ్లను ఉంచారు.

భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు శాశ్వత రక్షణ ఉండేలా, ఈ కమిషన్‌ను ఒక చట్టబద్ధమైన సంస్థగా మారుస్తూ చట్టం తీసుకురావాలని కోరారు. నాటి పోరాటంలో సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థల అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించాలని అన్నారు. స్వరాష్ట్ర సాధనలో పురుషులతో సమానంగా లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన మహిళా పోరాట యోధులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతతో పాటు ప్రత్యేక సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో జీవితకాల ఉచిత ప్రయాణ రవాణా పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. గుర్తింపు పొందిన ఉద్యమకారుల పిల్లలకు లేదా వారి తదుపరి తరానికి కేజీ నుండి పీజీ వరకు పూర్తి ఉచిత, నాణ్యమైన విద్యను ప్రభుత్వమే అందించాలి.

సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి నివాస అవసరాల నిమిత్తం ఉచితంగా 250 గజాల భూమిని కేటాయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి. వృద్ధాప్య దశలో ఉన్న ఉద్యమకారులు ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీలుగా గౌరవప్రదమైన జీవితకాల నెలవారీ పెన్షన్ ప్రతి నెల 1వ తేదీనే అందించాలి. అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా అపరిమిత వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయాలి. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా జరుగుతున్న పూర్తి స్థాయి డిజిటల్ రికార్డింగ్ ఆధారంగా, ఏ ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా ఈ హక్కులను సాధించి తీరుతామని గట్టి భరోసా ఇచ్చారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ఇవాళ సభలో ఉద్యమకారులు ప్రతిపాదించిన అంశాలను సమగ్ర నివేదికలో చేర్చుతామని, ముఖ్య మంత్రి కి నివేదిస్తామన్నారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎమ్ కోదండరామ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.