Kavitha | 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ : కవిత
ఈ నెల 12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : ఈ నెల 12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ ను కవిత ఆవిష్కరించారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లుగా తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, డిమాండ్ల సాధనపై సభలో చర్చించి పలు తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాయని కవిత ఆరోపించారు. జాగృతి ఉద్యమకారుల సమస్యల సాధనకు పోరాడుతుందని తెలిపారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లిన బుట్టెంగారి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తోందని ఈ సందర్బంగా కవిత స్పష్టం చేశారు. మాధవరెడ్డితో బీఆర్ఎస్ పార్టీనే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించిందా అని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ వైఖరి చూస్తే బీసీలకు 42శాతం రిజర్వేషన్ కు వ్యతిరేకం అన్నట్లుగా ఉందని, దీనిపై ఆ పార్టీ నాయకత్వం బీసీలకు స్పష్టతనివ్వాల్సి ఉందన్నారు.
త్వరలోనే నా కొత్త రాజకీయ పార్టీ ప్రకటన
త్వరలోనే నా కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని కవిత ప్రకటించారు. నేను సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్ముతానని, మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నానని, వచ్చే మూడు నెలల్లో పార్టీ ప్రకటిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున సింహం గుర్తుపై మేము పోటీచేస్తున్నాం అని, ప్రశ్నించే మాలాంటి వాళ్లతో పాటు సీపీఎం, న్యూ డెమోక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నానన్నారు. సిరిసిల్లలో 16 మంది బీఆర్ఎస్ వాళ్లు టికెట్ కోసం మమ్మల్ని కలిశారు అని కవిత తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులు ఇతర జిల్లాల్లో ఎందుకు తిరగడం లేదు? అని, కేవలం జాగృతి బరిలో ఉన్న చోటే హరీష్ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా నియమించారు అని, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పీకర్ ప్రకటిస్తే వారిని కూడా కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీలుగా నియమించిందని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తీరు నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది అని, రాహుల్ గాంధీకి ఆయన పట్టుకునే రాజ్యాంగంపై నమ్మకం ఉంటే స్పీకర్ ఇప్పటికైనా అరికేపూడి గాంధీపై వేటు వేయాలి అని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఒక పుస్తకం. ఆయన చరిత్రను ఎవరూ చెరిపేయలేరు అని కవిత స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram