విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా సంక్షోభం ఇంధన ధరలతో పాటు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలు సెలవు దినం ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,44,330 వద్ద నిలువగా..రూ. 1,32,300 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతుంది.
ధరల తగ్గుదల తాత్కాలికమే..
బంగారం ధరలు ఇటీవల కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌ఎస్‌బిసి (HSBC) పసిడిపై తన అంచనాను భారీగా తగ్గించుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా డాలర్ బలం పుంజుకోవడంతో పాటుగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంలో వస్తున్న మార్పులే రాబోయే కాలంలో బంగారానికి అతిపెద్ద సవాళ్లుగా మారుతున్నాయని సంస్థ పేర్కొంది.
అయితే ప్రస్తుత పతనం కేవలం తాత్కాలిక దిద్దుబాటు మాత్రమేనని.. దీర్ఘకాలంలో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. 2026 సంవత్సరానికి తన సగటు ధర అంచనాను ఔన్సుకు 4,864 డాలర్ల నుండి 4,560 డాలర్లకి తగ్గించింది. అలాగే 2027వ సంవత్సరానికి అంచనాను 5 వేల డాలర్ల నుండి 4,925 డాలర్లకి సవరించింది. అయితే 2028, 2029 దీర్ఘకాలిక అంచనాల్లో ఆ సంస్థ ఎలాంటి మార్పూ చేయలేదు.
దేశీయంగా బంగారం ధరలు ఇప్పటికే దాదాపు కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి.మార్కెట్లో ప్రతికూల వార్తలు ఉన్నప్పటికీ.. ఇక్కడి నుండి గరిష్టంగా మరో 5 శాతం మాత్రమే పతనం ఉండవచ్చని, అంతకు మించి భారీగా పడిపోయేందుకు ఎలాంటి సంకేతాలు లేవని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా స్పష్టం చేశారు. భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ. 1.35 లక్షల వద్ద ఒక బలమైన మద్దతు ఏర్పడవచ్చని.. ధరలు ఈ స్థాయి కంటే కిందకు పడిపోయే అవకాశాలు చాలా తక్కువని ఆయన పేర్కొన్నారు.