భారత్ కు మళ్లీ హర్మూజ్ గండం.. ఇంధన సంక్షోభం తప్పదా ?

అమెరికా-ఇరాన్‌ల పరస్పర దాడులతో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఆంక్షలు ప్రారంభమవ్వడం భారత్ కు తీవ్ర సమస్యాత్మకంగా మారనుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒమన్ కారిడార్ గుండా వెళ్తున్న ఒక భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్ భద్రతా దళాలు (ఐఆర్‌జీసీ) వెనక్కి పంపించాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పర్షియన్‌ గల్ఫ్‌లో తొమ్మిది భారత ట్యాంకర్లు చిక్కుకున్నాయని, వాటిలో 198 మంది నావికులు ఉన్నట్లు సమాచారం.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Jul 08, 2026, 8:28 pm IST
Read Time: 4 mins
భారత్ కు మళ్లీ హర్మూజ్ గండం.. ఇంధన సంక్షోభం తప్పదా ?

విధాత : అమెరికా-ఇరాన్‌ల పరస్పర దాడులతో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఆంక్షలు ప్రారంభమవ్వడం భారత్ కు తీవ్ర సమస్యాత్మకంగా మారనుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒమన్ కారిడార్ గుండా వెళ్తున్న ఒక భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్ భద్రతా దళాలు (ఐఆర్‌జీసీ) వెనక్కి పంపించాయి. అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఒమన్ కారిడార్‌ కాకుండా..హర్మూజ్ జలసంధిలో తాము చెప్పిన మార్గంలోనే వెళ్లాలని ఇరాన్ ఒత్తిడి చేస్తుంది.

గల్ఫ్‌ సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన నౌకలు వాటి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు వీలుగా ఒమన్‌, ఐరాస సముద్రయాన సంస్థ (UNIMO)లు.. ఒమన్‌ తీరం వెంబడి తాత్కాలిక కారిడార్‌ నుంచి వెళ్లాలని సూచించాయి. దీంతో అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఈ తాత్కాలిక కారిడార్‌నే ఆయా నౌకలు ఉపయోగించుకుంటున్నాయి. అయిత ఐఆర్‌జీసీ మాత్రం తాము సూచించినట్లు హర్మూజ్‌ మార్గంలోనే వెళ్లాలని నౌకలను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పర్షియన్‌ గల్ఫ్‌లో తొమ్మిది భారత ట్యాంకర్లు చిక్కుకున్నాయని, వాటిలో 198 మంది నావికులు ఉన్నట్లు సమాచారం. వీటిలో పూర్తి స్థాయిలో ఇంధనం, గ్యాస్‌తో కూడిన నౌకలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం.. ఆ నౌకలను సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు ఇరాన్‌తో సంప్రదింపులు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఈ రాత్రికి ఇరాన్ పై భారీ దాడులు : ట్రంప్

ఈరోజు రాత్రి ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. తుర్కియేలో జరుగుతున్న నాటో సదస్సులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇరాన్‌ దారుణంగా ప్రవర్తిస్తోంది. హర్మూజ్‌ వద్ద నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ రాత్రి ఇరాన్‌పై గట్టిగా విరుచుకుపడబోతున్నాం. ఆ దేశ  మౌలిక సదుపాయాలపై దాడి చేస్తాం. ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Tags: