ఇండోనేషియా ప్రంబానన్ దేవాలయ పునరుద్దరణ నా అదృష్టం: ప్రధాని మోదీ

ఇండోనేషియాలోని యునెస్కో వారసత్వ సంపద ప్రంబానన్ దేవాలయ సముదాయ పునరుద్ధరణకు భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2029 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jul 08, 2026, 5:16 pm IST
Read Time: 8 mins
ఇండోనేషియా ప్రంబానన్ దేవాలయ పునరుద్దరణ నా అదృష్టం: ప్రధాని మోదీ

ఇండోనేషియాలోని చారిత్రక ప్రంబానన్ దేవాలయ సముదాయాన్ని పునరుద్ధరించి, పరిరక్షించడానికి భారతదేశం సహాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా ఈ పురాతన ఆలయాన్ని సందర్శించి, ఈ విషయాన్ని ప్రకటించారు.ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో అత్యంత కీలకమైంది ప్రాచీన హిందూ ఆలయం ప్రంబానన్ దేవాలయ సముదాయ పునరుద్దరణ ఒకటి. 2029లోపు ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ పూర్తి చేసి, అది పూర్తయ్యాక మళ్లీ వస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ శివాలయాన్ని సందర్శించారు.అక్కడే ఆలయ పునరుద్దరణ ఫలకాన్ని ఆవిష్కరించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాను సందర్శించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా… రాబోయే సంవత్సరాన్ని ‘ఠాగూర్-దేవాంతర ఇయర్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ డిప్లొమసీ’గా జరుపుకోవాలని కూడా ఇరు దేశాలు ప్రకటించాయి.భారత్ గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తూ వస్తోంది. ఈ చర్యలు సాంస్కృతిక దౌత్యానికి, చారిత్రక బంధాల బలోపేతానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణకు భారత్–ఇండోనేషియా ఒప్పందం

1991లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఇండోనేషియాలోని ప్రంబానన్ ఆలయాన్ని వెయ్యేళ్ల కిందట హిందూ మాతరమ్ వంశీయులు నిర్మించారు.9వ శతాబ్దంలో హిందూ మాతరమ్ వంశానికి చెందిన రాజు రాకై పికటన్ ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగా.. అతని వారసుడైన లోకపాలుడు పూర్తి చేశాడని కథనం. చారిత్రాక ఈ ఆలయ పరిరక్షణకు భారత్ సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ఆలయం భారతదేశం,ఇండోనేషియా మధ్య ఉన్న సాంస్కృతిక,నాగరికతా బంధాలకు ప్రతీకగా భావిస్తారు. దీని గోడలపై రామాయణ ఇతిహాసానికి సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వెయ్యిళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ప్రధాన దేవతలు. మొత్తం 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో 240కిపైగా ఆలయాలు ఉండేవని, పదో శతాబ్దం తర్వాత నుంచి ఈ ఆలయం నిరాదరణకు గురవ్వడంతో వాటిలో చాల వరకు శిధిలావస్ధకు చేరాయి. దీంతో మళ్లీ ఆలయాన్ని పునరుద్దరించే ప్రయత్నాలు 19వ శతాబ్దం నుంచి పలు ధపాలుగా కొనసాగాయి. ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా ఉన్న ప్రంబానన్ ఆలయం భారత ఉపఖండం, ఆగ్నేయాసియా మధ్య శతాబ్దాల నాటి సంబంధాలను ప్రతిబింబిస్తూ, ఇండోనేషియా అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నాలలో ప్రంబానన్ ఒకటిగా నిలిచి ఉంది. కంబోడియాలోని అంగోర్ వాట్ తర్వాత ఆగ్నేయాసియాలో రెండో అతిపెద్ద హిందూ దేవాలయం సముదాయంగా గుర్తింపు పొందింది.

ప్రంబానన్ ఆలయ పునరుద్దరణ నా అదృష్టం

ఇండోనేషియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియోంతోతో కలిసి పురాతన ప్రంబానన్ హిందూ ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరిన త్రిమూర్తులు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..శివుడితో మమేకమయ్యే అవకాశం నాకు ఎప్పుడూ లభించడం నా అదృష్టం.. హట్కేశ్వర్ మహాదేవ్ వెలసిన వాద్ నగర్‌లో నేను పుట్టాను…ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయం గుజరాత్‌లోనే ఉంది.. దాని అభివృద్ధి బాధ్యతను నేను నేరుగా పర్యవేక్షిస్తున్నానని గుర్తు చేశారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం కాశీ (వారణాసి) లోని కాశీ విశ్వనాథుడు నన్ను నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.. కేదార్‌నాథ్ లేదా ఉజ్జయిని మహాకాల్ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రాచీన ప్రంబానన్ ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కడం మహాభాగ్యంగా భావిస్తున్నానని అని మోదీ పేర్కొన్నారు.

ఇరువురు నేతలూ హెలికాప్టర్‌లో ప్రంబవన్ ఆలయ సముదాన్ని విమానం ద్వారా పరిశీలించారు. మోదీ ఆ ఆలయ సముదాయానికి సంబంధించిన వైమానిక దృశ్యాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘గంభీరమైన ప్రంబనన్ ఆలయం ! అని రాశారు.