రిటైర్డ్ ఉద్యోగుల మరణాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి: బక్క జడ్సన్

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు 100కు చేరాయి అని, వీటిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) కేసు నంబర్. 15749/IN/2026 నమోదు చేసిందని, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 08, 2026, 7:53 pm IST
Read Time: 5 mins
రిటైర్డ్ ఉద్యోగుల మరణాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి: బక్క జడ్సన్

విధాత, హైదరాబాద్: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు 100కు చేరాయి అని, వీటిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) కేసు నంబర్. 15749/IN/2026 నమోదు చేసిందని, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు.

తెలగాణలో రిటైర్డ్ ఉద్యోగుల మరణాల సంఖ్య 100కు చేరిన నేపథ్యంలో, ఈరోజు హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేసి, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా జడ్సన్ మాట్లాడుతూ.. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న 25,354 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరణించిన రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య 100కు చేరిందని ఆయన తెలిపారు. ఇటీవల జంగాం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య తనకు రావాల్సిన సుమారు రూ.10.77 లక్షల జీపీఎఫ్ బకాయిలు విడుదల కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకర సంఘటన అని పేర్కొన్నారు. ఈ పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగుల జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవన హక్కుకు భంగం కలిగించే మానవ హక్కుల సమస్యగా మారిందని బక్క జడ్సన్ అన్నారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలు అమలు చేయాలి

తెలంగాణలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలు) చెల్లింపులో ప్రభుత్వం కొనసాగిస్తున్న జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక, మానసిక వేదనకు గురవుతున్న రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితిపై సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును NHRC కేసు నం. 15749/IN/2026గా నమోదు చేసింది.

ఇప్పటికే 13 అక్టోబర్ 2025న సమర్పించిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ 06 జనవరి 2026న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 8 వారాల్లో చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని బక్క జడ్సన్ ఆరోపించారు. NHRC ఇచ్చిన 8 వారాల గడువు ముగిసినా, కమిషన్ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేయడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.

06/01/2026న జారీ చేసిన ఆదేశాల అమలుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి వెంటనే Action Taken Report (ATR) నుకోరాలని, పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అత్యవసరంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.