విధాత, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు వేతనాలను ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందించడానికి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్(TGMEU) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ కొన్ని శాఖల్లో ఇప్పటికీ జీతాలు అందని పరిస్థితి పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించింది.
ప్రత్యేకించి వైద్య, ఆరోగ్య శాఖలో అతి కీలకమైన వైద్య విధాన పరిషత్ ( డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్)లో మూడు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు ఈ రోజ వరకు చెల్లించక పోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వ ప్రకటనల ఆర్భాటమా లేక అధికారుల నిర్లక్ష్యమా తెలియక అయోమయంలో ఉన్నారని, ఈ విభాగానికి ఒక విభాగాధిపతిని కూడా నియమించకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనమైన పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారన్నారు. అత్యంత పని ఒత్తిడిలో ఉండే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకే తాత్కాలికంగా ఈ విభాగం బాధ్యతలు అప్పగించడంతో సాధారణ ఉద్యోగులెవరికీ తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లభించడం లేదు అన్నారు.
ఇప్పటికైనా, తాము విధిలేని పరిస్థితుల్లో తిరిగి రోడ్డెక్కకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకుని..సోమవారంలోగా బకాయిపడ్డ మూడు నెలల వేతనాలు చెల్లించాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం అవుతామని తెలియచేస్తూ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది.