హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై 185 కేసుల నమోదు !

హైదరాబాద్ మహా నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫుడ్ మాఫియాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్(H-FAST) అధికారులు ఆహార కల్తీపై హైదరాబాద్ లోని 7 జోన్లలో 100రోజుల వ్యవధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి సుమారు 1,21,874.9 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 04, 2026, 2:18 pm IST
Read Time: 7 mins
హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై 185 కేసుల నమోదు !

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫుడ్ మాఫియాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ప్రత్యేక తనిఖీల డ్రైవ్‌లో హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) అధికారులు భారీ ఎత్తున నకిలీ, కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది ప్రత్యేక సిబ్బందితో కూడిన ఈ టీమ్, జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ ఏడాది మార్చి 19 నుంచి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తోంది.

ఫుడ్ సెఫ్టీ యంత్రాంగం H-FAST అధికారులు ఆహార కల్తీపై హైదరాబాద్ లోని 7 జోన్లలో 100రోజుల వ్యవధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి సుమారు 1,21,874.9 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎక్కువగా జింజర్ గార్లిక్ పేస్ట్ 27 టన్నులు, రిపెనింగ్ ఫ్రూట్స్ 25 టన్నులు, చికెన్/మీట్ 15 టన్నులు, పికిల్స్ 9 టన్నులు, కోవా, టీ పౌడర్, పనీర్, గీ, క్రీమ్ ఉన్నాయి. దీంతో పాటు పనీర్ అవుట్లెట్స్, హోటల్స్, వాటర్ ప్యాకింగ్ యూనిట్స్, ఎక్స్‌పైరీ ఫుడ్ పై మరో 247 కేసులు నమోదు చేసి, కొన్ని కేసులను FSO, GHMC కి అప్పగించారు.

మార్చి 19న ప్రారంభమైన హెచ్-ఫాస్ట్ దాడులకు 100 రోజులు పూర్తి అయ్యింది. ఈ వంద రోజుల్లో రాజేంద్రనగర్ జోన్‌లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 27 టన్నులకు పైగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లను అధికారులు సీజ్ చేశారు. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాణ్యతలేని చికెన్, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెచ్-ఫాస్ట్ అధికారుల దాడుల్లో కల్తీ కోవా, పనీర్, పెరుగు, నెయ్యి, క్రీమ్, టీ పొడి భారీగా పట్టుబడింది. ఆరోగ్యానికి హానికరమైన 247 కేసులను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా 90 కేసులు నమోదవగా… పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు నమోదు అయ్యాయి. ఇవే కాకుండా ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలు, వాటర్ ప్లాంట్లు, సమోసా సెంటర్లు, బేకరీలు, హాస్టళ్ల కిచెన్ల పై కూడా అధికారులు దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు.

నాణ్యమైన ఆహారం విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు హెచ్-ఫాస్ట్ అధికారులు కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, FIFO విధానం, వాడిన నూనె పునర్వినియోగంపై ఆంక్షలు విధించారు. కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక జారీ చేశారు. ప్రతి రోజు సగటున 15 కల్తీ ఆహార ఫిర్యాదులు అందుతున్నట్లు వెల్లడించారు. కల్తీ సమాచారం ఉంటే డయల్ 100, H-FAST వాట్సాప్, ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

హోటళ్లు, వ్యాపారులకు కఠిన రూల్స్..

ఆహార వ్యాపారులతో పోలీసులు, అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి సీపీ వీసీ సజ్జనర్ ఈ రూల్స్ తప్పనిసరి చేశారు. ప్రతి హోటల్, వ్యాపార సంస్థకు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి.
ఫుడ్ సర్వ్ చేసే సిబ్బంది అంతా మాస్కులు, గ్లౌజులు కచ్చితంగా వేసుకోవాలి. వాడిన నూనె వాడొద్దు, వంట నూనెను పదే పదే మరిగించి వాడితే కఠిన చర్యలు ఉంటాయి. FIFO రూల్: వస్తువులు పాడవకుండా ఉండటానికి పాత స్టాక్‌ను ముందే వాడే పద్ధతిని పాటించాలి. ఈ నిబంధనలు పాటించకపోతే హోటళ్లను తక్షణమే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. “కల్తీ ఆహారం వల్ల చిన్న పిల్లల ఎదుగుదల దెబ్బతినడమే కాకుండా.. పెద్దల్లో క్యాన్సర్, కిడ్నీలు పాడవడం, గుండె జబ్బులు వస్తున్నాయి. ఇది కేవలం చిన్న మోసం కాదు, అమాయక ప్రజలను చంపడానికి చేస్తున్న ప్రయత్నం. అందుకే ఇలాంటి వారిపై కఠినంగా ఉంటాం” అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.