విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ద ఉద్రిక్తతలు తలెత్తడం… అమెరికా– ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ గడువు ముగియడం…రెండు దేశాలు మళ్లీ పరస్పరం హెచ్చరికలకు దిగడం వంటి పరిణామాలు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్న పసిడి ధరలు మరోసారి పెరుగగా..వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. మంగళవారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.1,55,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,42,900 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,55,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
పసిడి మరింత ముందుకే..
ఈ ఏడాది జనవరిలో బంగారం ధర రూ.1,70,000 వరకు పెరిగింది. ఆ తర్వాత వరుసగా తగ్గుతూ వస్తూ మార్చిలో 1.30 లక్షలకు తగ్గింది. అంటే గరిష్టం నుంచి 23 శాతం తగ్గింది. జూన్‌లో కాస్త తగ్గిన బంగారం ధరలు ఆగస్టులో మళ్లీ పెరుగుతున్నాయి. చాలా మంది పసిడి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితి, డాలర్ విలువ, వడ్డీ రేట్లు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీరేటు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు , సురక్షిత పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లతో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
అయితే బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే నమ్మకంతో మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదని సూచిస్తున్నారు. బంగారం మళ్లీ 2 లక్షలకు పెరుగుతుందనో, మళ్లీ లక్షకి పడిపోతుందనో ఇలా ఏ దిశగా ఆలోచించినా ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా బంగారం ధర అంచనాల్లో ఒకే లక్ష్యాన్ని చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి సాధారణ పరిస్థితుల్లో సుమారు 5 శాతం అటూ ఇటూ కదిలే అవకాశముందని మాత్రమే అంచనా వేసిందని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, తక్కువ వడ్డీరేట్ల అంచనాలు కారణంగా బంగారంధర మరింత పైకి వెళ్లే అవకాశముందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది.