తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను యథాతథంగా కొనసాగిస్తామని, హైకోర్టులో మధ్యంతర స్టే ఎత్తివేయించి మళ్లీ అమలు చేసేందుకు న్యాయపరంగా చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైకోర్టు స్టేపై బీఆర్ఎస్ నేతలు అనవసర ఆందోళనలతో రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకాలపై హైకోర్టు విధించిన స్టేను తొలగించేందుకు త్వరలోనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన ఉత్తర్వుల వల్లే ప్రస్తుత న్యాయపరమైన చిక్కులు తలెత్తాయని, త్వరలోనే అన్ని పొరపాట్లను సరిదిద్ది పథకాలను కొనసాగిస్తామని ప్రకటించారు.
న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే, పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా ఈ పథకాల రాజ్యాంగబద్ధతను, అవసరాన్ని కోర్టుకు వివరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. 2014లో పథకాన్ని ప్రారంభించిన సమయంలో అప్పటి ప్రభుత్వం సరైన నిబంధనలతో జీవోలు ఇవ్వలేదని, అందుకే ఇప్పుడు సాంకేతిక ఆధారాలతో కోర్టులో పిటిషన్లు పడ్డాయని విమర్శించారు. హైకోర్టు స్టేకు ప్రభుత్వంలో న్యాయపరమైన అంశాలు చూసే అధికారుల లోపమా లేదా విభాగాధిపతుల అలసత్వమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గత ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఎలాంటి జాప్యం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రీన్ ఛానెల్’ ద్వారా నిధులను నేరుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు నేను సవాల్ చేస్తున్నానని..గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతమందికి ఇళ్లు ఇచ్చిందో, ఎంతమందికి ఉపాధి కల్పించిందో చర్చకు సిద్ధమని ప్రభుత్వం సవాల్ చేశారు.