హైలైట్స్:
- రూ.29 విలువ చేసే క్యాథటర్ కు రూ.310 కి బిల్లు
- ప్రైవేటు ఆసుపత్రుల్లో ధరల మోత
- నియంత్రణ సంస్థల పై అవగాహన లేమితోనే
విధాత, హైదరాబాద్: దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తమకు అడ్డూ అదుపు లేదనే విధంగా అటు అధికారులను ఇటు రాజకీయ నాయకులకు మామూళ్లు ముట్టచెప్పి చికిత్స కోసం వచ్చే రోగులను నిలువుదోపిడి చేస్తూ వస్తున్నాయి. రోగులు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల బదులు చిన్న చిన్న రోగాలకు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల బలహీనత, ఆరోగ్యం పై శ్రద్ధను ఆసరాగా చేసుకుని వచ్చినంత వరకు పిండేస్తూ వాళ్ల జేబులను ఖాళీ చేస్తున్నాయి. దీంతో మెజారిటీ రోగులు అప్పుల పాలవుతూ స్థిరాస్తులు తెగనమ్ముకునే పరిస్థితులు దాపురించాయి. ఆసుపత్రులలో రోగులకు వాడే మందులు, వైద్య పరికరాలు (శస్త్ర చికిత్స వస్తువులు) లో పెద్ద ఎత్తున దోపిడికి పాల్పడుతున్నాయి. కంపెనీలు నిర్ణయించే ధరలపై 2,841 శాతానికి పైగా అధికంగా వసూలు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడయింది. ఈ సర్వే లోని ధరలను చూసి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా విస్తుపోయింది. ఇవేమీ ధరలు అంటూ ఆగస్టు 10వ తేదీన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి లేఖలు రాసింది. రోగుల జేబులను ఖాళీ చేస్తున్న అంతులేని ధరలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ దూకుడుగా చర్యలు తీసుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఎక్కడెక్కడ దోపిడి జరుగుతున్నది, వ్యాపారులు ఎలా కోట్లకు పడగలెత్తుతున్నారు, ప్రజలు ఏం చేయాలనే దానిపై ఆహార, పానీయ సంస్థలను విక్రయించే దుకాణాలు, పలు కంపెనీలపై దాడులు నిర్వహిస్తున్నది. పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ, అపరిశుభ్ర వాతావరణం ఉన్న వ్యాపార సంస్థలను మూసివేస్తూ నోటీసులు జారీ చేస్తున్నది. కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేస్తున్నది. ప్రముఖ వ్యాపార సంస్థలు కూడా ఈ జాబితాలో ఉండడంతో ముంబై పౌరులు సైతం అప్రమత్తమయ్యారు. ఇంతకాలం తాము పరిశుభ్రత లేని, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, బేకరీలు, ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్లామా అని బాధపడ్డారు. తాజాగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో జరుగుతున్న మోసాలపై కన్నేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో మందులు, వైద్య పరికరాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేను అధ్యయనం చేయగా పలు మోసాలు వెలుగు చూశాయి. ఇన్ పేషెంట్ల కు అవసరమైన వైద్య పరికరాలు, శస్త్ర చికిత్స వస్తువులు విరివిగా ఉపయోగిస్తుంటారు.
ఈ సమయంలో రోగులు వారి బంధువులు ధరలను పెద్దగా పట్టించుకోరు. కారణం ఏమంటే పేషెంట్ బతికితే చాలు అనే విధంగా మిన్నకుండిపోతారు. ఇందులో ఇంట్రావీనస్ ఇన్పూజన్ సెట్స్, సిరంజీలు, నెబులైజర్లు, ఆక్సిజన్ మాస్కులను ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ధరలకు బిల్లులు వేస్తున్నట్లు తేలింది. బహిరంగ మార్కెట్ తో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టం అయింది. హోల్ సేల్ ధరలకు కొనుగోలు చేసి, అత్యధిక మార్జిన్ తో రోగులకు అంటగడుతున్నట్లు నిర్థారణకు వచ్చారు. ఉదాహారణకు క్యాథటర్ ఒకటి రూ.29.41 పైసలకు కొనుగోలు చేసి రూ.310 చొప్పున బిల్లు వేస్తున్నారు. అంటే ఒక రోగి నుంచి రూ.280.59 పైసలు అత్యధికంగా తీసుకుంటున్నారు. అదే విధంగా ఐవీ ఫ్యూజన్ సెట్ ఒకటి రూ.11.05 పైసలకు కొనుగోలు చేసి, రోగులకు రూ.325 చొప్పున బిల్లు వేసి వసూలు చేస్తున్నారు. కంపెనీలు లేదా హోల్ సేల్ వ్యాపారుల నుంచి ఆసుపత్రి యాజమాన్యాలు కొనుగోలు చేసి, వాటికి అత్యధికంగా 2,841 శాతానికి పైగా అధిక ధరను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వీటిని కూడా అప్పు కింద కొనుగోలు చేసి, విక్రయాలు జరిగిన తరువాత వ్యాపారులు లేదా కంపెనీలకు చెల్లింపులు చేస్తున్నారు. లాభాల్లో కూడా హేతుబద్దంగా ఉండాల్సిన ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా రోగుల బలహీనతలను ఆసారా చేసుకుని నిలువు దోపిడి చేస్తున్నాయి. ప్రభుత్య నియమావళి ని పూర్తిగా ఉల్లంఘిస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. ఇక్కడ ధరల దోపిడి కాకుండా రోగుల హక్కులను కాపాడుతూ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపై ఉంది.
ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో అడ్డగోలు దోపిడి పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారామ్ ముండే మాట్లాడుతూ, రోగులకు ఈ ధరలపై అవగాహన లేకపోవడం, వారిలో చైతన్యం కొరవడడం ప్రధాన కారణమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే బిల్లులు వేస్తున్నాయా అనేది తెలియకపోవడమే ప్రధాన సమస్య అన్నారు. ఉత్పత్తిదారుడి నుంచి మధ్యవర్తి లేదా హోల్ సేల్ వ్యాపారి ద్వారా ఆసుపత్రి యాజమాన్యాలకు ఏ ధరకు వస్తున్నాయి, ఆసుపత్రి యాజమాన్యాలు ఎంత లాభంతో రోగులకు బిల్లు వేస్తున్నారనేది అధికారులు కూడా విచారణ జరిపారన్నారు. ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు తేలిందని, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కూడా దీనిపై విచారణ చేస్తున్నదని ముండే పేర్కొన్నారు. ఏ ధరకు విక్రయిస్తున్నది కూడా ఉత్పత్తి చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు నివేదికలు అథారిటీకి అందచేస్తాయన్నారు. మహారాష్ట్ర కాకుండా పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు కు చెందిన డ్రగ్ కంట్రోల్ నుంచి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కి పలు ఫిర్యాదులు వెళ్లాయన్నారు.
డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్ – –013 ప్రకారం వైద్య పరికరాలను అత్యధికంగా ఎంత మేరకు విక్రయించాలనే దానిపై సీలింగ్ విధించిందన్నారు. ఎడాది వ్యవధిలోపు పది శాతానికి మించి అత్యధిక మార్జిన్ తో రోగులకు విక్రయించడానికి వీలు లేదని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. కరోనరీ స్టెంట్లు, మోకాలు శస్త్ర చికిత్సలో ఉపయోగించే కృత్రిమ పరికరాల ధరలను నియంత్రిస్తూ ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయన్నారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ తో పాటు ఇతరత్రాలపై అధిక ధరలు వసూలు చేయకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిరంతరం పర్యవేక్షణ చేసిందని తుకారాం ముండే వివరించారు.