హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విధాత): సెప్టెంబర్ 17 వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ పర్యటించనున్ననారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో సి.ఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, ఈనెల 17 న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్నారని తెలిపారు.
17 న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకొని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ , డీజీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, హైదరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమీషనర్లు సజ్జనార్, సుమతి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.