విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 1000రోజులు పూర్తయిన సందర్బంగా అధికార పార్టీ తను సాధించిన విజయాలపైన, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపైన పోటాపోటీ ప్రచారానికి దిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 13డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలు సంగతి పక్కనపెడితే..ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి, అక్రమాలపై చెప్పిన మాటలు, సవాళ్ల సంగతి మాత్రం మరోవైపు హాట్ టాపిక్ గా మారింది.
హామీలలో కొన్నైనా అమలు..కేసుల లెక్కలే తేలలే!
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలపై విచారణ చేసి వారిని జైళ్లో పడేస్తామని..తిన్నదంతా కక్కిస్తామని జోరుగా డైలాగ్ లు పేల్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవినీతి, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అవినీతి, థర్మల్ ఫ్లాంట్ల నిర్మాణాల్లో అవతవకాలపైన, ఓఆర్ఆర్ లీజుపైన విచారణ కమిషన్ల నియామకం, ధరణి భూ వివాదాల స్కామ్, ఫార్ములా ఈ రేసు స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్, టూరిజం స్కామ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్ వంటి వాటిపై కేసుల నమోదు ..విచారణలు, కమిషన్ల నియామకాల పర్వం చేపట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ 1000రోజుల పాలన పూర్తయ్యాక చూస్తే వాటిలో ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా తేలకపోవడం ఈ సందర్బంగా గమనార్హం.
కాళేశ్వరం అక్రమాలపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వివాదం కోర్టుకెక్కగా..ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికలు ఉన్నా వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కేసీఆర్, హరీశ్ రావుల అరెస్టు దాకా వెళ్లకుండానే.. చివరకు కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలంటూ లేఖ ఇచ్చి రేవంత్ సర్కార్ చేతులు దులుపేసుకుంది. ఇక ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించకపోతే కేంద్రంలోని బీజేపీని సైతం రేవంత్ విమర్శించారు. తీరా అనుమతించాక..కేటీఆర్ అరెస్టుపై ఊసు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదలైన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే 1000రోజుల పాటు కొనసాగుతునే ఉంది. ఆయా కేసులన్ని పెండింగ్ లో ఉండగానే..మధ్యలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మైనింగ్ అక్రమాలు, భూ కేటాయింపులు, ధరణి అక్రమాలపైన విచారణ కమిటీలు వేసి వాటిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గత ప్రభుత్వాల హయాంలో అవినీతి, అక్రమాలపై విచారణలు చేయడం..ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం రాజ్యాంగ బద్ద ప్రభుత్వాల బాధ్యత. అయితే తమపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులన్ని రాజకీయ కక్ష్య సాధింపులలో, డైవర్షన్ పాలిటిక్స్ లలో భాగంగానే పెట్టారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ 1000రోజుల పాలనలో ఆ కేసులలో ఒక్కటి కూడా తేల్చని తీరుచూస్తుంటే ప్రతిపక్ష ఆరోపణలు నిజమనుకునే అవకాశం ప్రభుత్వమే ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రహస్య అవగాహనతోనే ఆ కేసుల విచారణలు అటకెక్కుతున్నాయన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలకులపై కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన కేసులపై వేసిన సిట్లు, కమిషన్లు, విచారణ కమిటీలు మిగిలిన 820రోజుల పాలన కాలంలోనైనా ఆ కేసులను తేలుస్తాయా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.