విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపైన, టికెట్లు అమ్ముకున్నారన్న సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఢిల్లీ వేదికగా హైకమాండ్ చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు ముగియ్యగా..ఈ రోజు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ కార్యదర్శి బీ.మహేశ్ కుమార్ గౌడ్ లు చర్చలు కొనసాగిస్తున్నారు.
వారితో చర్చల అనంతరం ఢిల్లీలోనే ఉన్న మంత్రి కొండా సురేఖతో కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ లు కూడా ఢీల్లీలోనే ఉన్నారు. సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యల అంశంలో భట్టి, ఉత్తమ్ ల అభిప్రాయాలను కూడా కేసీ వేణుగోపాల్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
సురేఖను తప్పించడం ఖాయమేనా?
తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం ఖాయమేనన్న ప్రచారం వినిపిస్తుంది. తన రాజకీయ భవిష్యత్తుపై తగిన భరోసా ఇచ్చి..ఆమెతో మంత్రి పదవికి రాజీనామా చేయించాలా? లేదా కేబినెట్ విస్తరణ సమయంలో గౌరవంగా పక్కన పెట్టాలా? అనే అంశంపైనే హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశంపై చర్చించినట్లుగా సమాచారం. సురేఖను తప్పిస్తే రాజకీయంగా, బీసీ సామాజిక వర్గాల పరంగా ఎదురయ్యే పరిణామాలపై కూడా రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ సమగ్రంగా చర్చించారని పార్టీ వర్గాల కథనం. సురేఖ ఒక్కరిపైనే వేటు వేస్తే వచ్చే ప్రతికూల సంకేతాలను నివారించేందుకు, పూర్తి స్థాయి కేబినెట్ మార్పుచేర్పుల్లో భాగంగానే తప్పించే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, భట్టి, ఉత్తమ్ లతో, సురేఖతో కేసీ వేణుగోపాల్ చర్చల పిదప సాయంత్రం కల్లా మంత్రివర్గ విస్తరణ, సురేఖ భవితవ్యానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణల నేపథ్యంలో మంత్రి పదవుల ఆశావహులైన ఎమ్మెల్యేలు వరుసగా ఢిల్లీకి క్యూ కడుతుండటం కూడా ఆసక్తిరేపుతోంది.