కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలపై ప్రభుత్వానికి కోర్టు ఊరట!

తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి అందిస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలపై ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. ఈ పథకాల అమలుపై సింగిల్‌బెంచ్‌ ఇచ్చిన స్టేను చీఫ్ జస్టీస్ ధర్మాసనం ఎత్తివేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Sep 01, 2026, 2:31 pm IST
Read Time: 3 mins
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలపై ప్రభుత్వానికి కోర్టు ఊరట!

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి అందిస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలపై ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. ఈ పథకాల అమలుపై సింగిల్‌బెంచ్‌ ఇచ్చిన స్టేను చీఫ్ జస్టీస్ ధర్మాసనం ఎత్తివేసింది. ఆయా పథకాల అమలులో  చట్టబద్దత లేకుండా 2014నుంచి రూ.16వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని భావించిన సింగిల్ బెంచ్ ఈ పథకాల అమలుపై స్టే విధించింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లో యువతుల పెళ్లికి ప్రభుత్వం సాయం చేస్తోందని, పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు.

ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని పేర్కొన్నారు. షాదీ ముబారక్‌ లాంటి పథకాన్ని సుప్రీంకోర్టు అనుమతించిందని, అలాంటిదే కల్యాణలక్ష్మి పథకమన్నారు. ఈ పిటిషన్‌ సింగిల్‌ జడ్జి వద్ద విచారణార్హం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించే పరిధి ఈ డివిజన్‌ బెంచ్‌కు ఉందన్నారు.

‘పేద, నిమ్న వర్గాలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థికసాయం చేయడం ద్వారా ఆయా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు. ఈ పథకాలు బాల్య వివాహాలను అరికట్టటానికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు . పథకాల అమలుపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వ వాదనలు విన్న సీజే ధర్మాసనం పథకాల అమలుపై సింగిల్‌బెంచ్‌ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది.