షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు

గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీని తొలగించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సంచలనం రేపింది. కిడ్నీని బయట విక్రయించాలనే దుద్దేశంతోనే ఆస్పత్రి వర్గాలు ఇలా కిడ్నీని మాయం చేశాయని కమలమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Sep 05, 2026, 12:41 pm IST
Read Time: 3 mins
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు

విధాత, హైదరాబాద్ : గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీని తొలగించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సంచలనం రేపింది. 45 రోజుల క్రితం ఆలేరులోని అర్పిత నర్సింగ్ హోమ్‌లో యాదగిరిగుట్టకు చెందిన కమలమ్మకు గర్భసంచిలో కణితి ఉందని చెప్పి శస్త్రచికిత్స చేశారు. ఆమె మూడు రోజుల క్రితం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకుంది. జనగామలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లో కమలమ్మ పరీక్షలు చేయించుకోగా, శరీరంలో కుడి వైపు కిడ్నీ లేదని తేలింది.

దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వైద్యుడిని నిలదీశారు. ఆపరేషన్‌కు ముందు రెండు కిడ్నీలు ఉన్నట్లు స్కానింగ్‌ నివేదికల్లో స్పష్టంగా ఉందని, తమకు చెప్పకుండా కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిడ్నీకి కొవ్వు పేరుకుపోయిందని, దానిని కొవ్వు గడ్డ అనుకుని పొరపాటున తొలగించామని డాక్టర్‌ తెలిపినట్లు బాధితులు వాపోయారు. వైద్యుడు నిర్వాకం బయటపడటంతో తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కిడ్నీని బయట విక్రయించాలనే దుద్దేశంతోనే ఆస్పత్రి వర్గాలు ఇలా కిడ్నీని మాయం చేశాయని కమలమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వైద్యుడిని అరెస్టు చేశారు.