నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్

ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుంచీ తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను ఒక్క పోటుతో కూల్చేశారని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో తలెత్తిన సమస్యలకు ఎంపీ మల్లు రవి కారణమని ఆరోపించారు. భవిష్యత్తు రాజీకీయ కార్యాచరణ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దానిపై ఆలోచిస్తానని తెలిపారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Sep 04, 2026, 2:28 pm IST
Read Time: 4 mins
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్

విధాత, హైదరాబాద్ : ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుంచీ తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను ఒక్క పోటుతో కూల్చేశారని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని సొంతూరు జయన్న తిరుమలాపురంలోని వ్యవసాయ క్షేత్రంలో మీడియాతో మాట్లాడారు. తనను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో చిన్నారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో వీ. హనుమంతరావు తరువాత తానే సీనియర్‌నని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీలో తలెత్తిన సమస్యలకు ఎంపీ మల్లు రవి కారణమని ఆరోపించారు. భవిష్యత్తు రాజీకీయ కార్యాచరణ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దానిపై ఆలోచిస్తానని తెలిపారు.

పదవి ఉన్నా, లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని చెప్పారు. తాజా పరిణామాలపై తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలువలేదని, కలిసేందుకు కూడా ప్రయత్నించలేదని తెలిపారు. కొండా సురేఖ ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం దక్కలేదని, తన పరిస్థితి కూడా అంతేనని, అందుకే వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తనకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన ఉత్తర్వుల్లోనే కాల పరిమితిని పేర్కొనలేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని మాత్రమే పేర్కొన్నారని వెల్లడించారు. తన కుమారుడికి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ కోరలేదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.