బర్తరఫ్ తో బీసీ మహిళకు అవమానం : కొండా సురేఖ

కేబినెట్‌ నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ మహిళను అవమానించారని ఆరోపిస్తూ, తనను సమాచారం ఇవ్వకుండానే తొలగించారని అన్నారు.

Reported by: Tejaswini Nanna | Latest News | Sep 03, 2026, 4:06 pm IST
Read Time: 5 mins
బర్తరఫ్ తో బీసీ మహిళకు అవమానం : కొండా సురేఖ

కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బీసీ మహిళను అవమానించారని కొండా సురేఖ మండిపడ్డారు. నన్ను ఎవరూ కూడా మంత్రి పదవికి రాజీనామా చేయమని అడుగలేదని, సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారని సురేఖ స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఇచ్చిన వివరణ లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు.

క్రమశిక్షణ చర్యలు నాపైనే ఎందుకని… కాంగ్రెస్ పార్టీపైన, ప్రభుత్వంపైన కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సురేఖ ప్రశ్నించారు. సురేఖను మంత్రిగా తొలగించకపోతే నేను సీఎంగా ఉండనని, పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి..నన్ను బర్తరఫ్ చేశారని ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి వంటి రేవంత్ సోదరులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు నాపై వేటు వేసేందుకు అధిష్టానంపై ఒత్తిడి చేశారని అన్నారు. తెలుగు దేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ తరహా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

నన్ను మంత్రి పదవి నుంచి తొలగించిన సందర్భంలో మరో ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని సురేఖ చెప్పారు. నా వల్ల వారికి పదవులు రావడం నాకు సంతోషంగా ఉందన్నారు. చిన్నారెడ్డిని నా వివాదం సందర్బంగా బలి చేయడం అన్యాయంగా ఉందని సురేఖ అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభలో చేసిన టికెట్ వ్యాఖ్యల వివాదమే దీనికంతటికి కారణం అని సురేఖ చెప్పారు. రేవంత్ రెడ్డి పరకాల టికెట్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన నా కూతురు సుస్మితా ప్రతిస్పందించారని, ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారని స్పష్టం చేశారు. నా ఉసురు తగులుతుందని, దేవుడున్నాడని ఆయన చూస్తారని సురేఖ చెప్పారు. మంత్రి పదవి పోయిందన్న బాధ నాకు లేదని, గతంలోనూ రాజీనామా చేశానని, జరిగిన అంశంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు.

నా కూతురు ఇండిపెండెంట్ వ్యక్తి అని, తన ఫ్యామిలీ తనది అని, ఆమె రాజకీయ ఆలోచనలు, లక్ష్యాలు అమెకు ఉన్నాయని, ఆమె చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం లేదు అని కొండా సురేఖ స్పష్టం చేశారు. రాజకీయాలలోకి రావాలని సుస్మితకు కోరిక ఉందని, కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీగా చేసుకున్నారని, కొండా మురళికే చైర్మన్ పదవి ఇవ్వడం లేదని, ఇక నాకు టికెట్ ఏం ఇప్పిస్తారంటూ అసహనంతో రేవంత్ టికెట్ ప్రకటనపై విమర్శలు చేసిందని సురేఖ పేర్కొన్నారు. నాపై ఇప్పుడు కుట్ర చేసిన వ్యక్తులే గతంలో 2018లో నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చిందని సురేఖ చెప్పారు.