మంత్రి పదవికి రాజీనామాకు ససేమిరా అంటున్న కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ కు సిఫారసు చేస్తూ సీఎంవో కార్యాలయం లోక్ భవన్ కు లేఖ అందించింది. ఈ లేఖ ఆధారంగా మరికొద్ధి సేపట్లో గవర్నర్ నుంచి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లుగా ఆదేశాలు వెలువడనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి బయలుదేరినప్పుడే.. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ లేఖను గవర్నర్ కు పంపించాలని సీఎంవో కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సీఎంవో అధికారులు లేఖను సిద్దం చేసి లోక్ భవన్ కు పంపించారు.
అటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఉన్న జి.చిన్నారెడ్డిని తొలగిస్తూ..ఆయన స్థానంలో హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ సీఎంవో నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరేళ్ల శారదను, కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథార్టీ చైర్మన్ గా గుండు సుధారాణిని నియమిస్తూ సీఎంవో కార్యాలయం నుంచి జీవోలు వెలువడ్డాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి, మున్నురు కాపు వర్గాలకు చెందిన మహిళలను ఆయా పదవుల్లో నియమించడం గమనార్హం.
మరోవైపు తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన ఆదేశాలు వెలువడిన వెంటనే మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన పరిస్థితులపై మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైన, కాంగ్రెస్ హైకమాండ్ పైన కొండా సురేఖ, మురళీ దంపతులు తీవ్ర విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది.