విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ రియల్టీ మార్కెట్ నిలకడగా కొనసాగుతుంది. ఇళ్ల కొనుగోలులో స్తబ్ధత కొనసాగుతున్నప్పటికి మార్కెట్ మాత్రం వృద్ధి బాటలోనే కొనసాగుతున్నట్లుగా క్రేడాయ్ నివేదిక పేర్కొంది. హైటెక్స్ వేదికగా జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో భాగంగా ‘హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్-2026’ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు విడుదల చేశారు.
ఈ నివేదిక మేరకు 2026 తొలి అర్ధభాగంలో (హెచ్1-సీవై26) నగరంలో 26,100 ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.52,900 కోట్లు. ఫుణె, బెంగళూరు, థానే నగరాల్లో విక్రయాలు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ దేశంలోని టాప్-3 నగరాల జాబితాకు కొద్దిగా దూరమైంది. ప్రధాన నగరాలతో పోలిస్తే విక్రయాల పరంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం విక్రయించిన విస్తీర్ణాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం విశేషం.
ఈ కాలంలో నగరంలో హెచ్1-సీవై26లో 60 మిలియన్ చదరపు అడుగుల సూపర్ బిల్ట్ అప్ ఏరియా అమ్ముడైంది. దీంతో పెద్ద ఇళ్లకు హైదరాబాద్ కొనుగోలుదారుల్లో ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. నగరంలో కొనుగోలుదారులు చిన్న ఇళ్ల కంటే పెద్ద విస్తీర్ణం కలిగిన అపార్టుమెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనం కనిపిస్తుంది.
2025 హెచ్ 1 తో పోలిస్తే ఇళ్ల సగటు ధర రూ. 1.85కోట్ల నుంచి రూ. 2.03కోట్లకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఇంకా 1,42,722యూనిట్లు అమ్మకానికి ఉన్నాయని, అవన్ని కూడా సేల్ కావడానికి మరో రేండున్నరేళ్లు పట్టవచ్చని అంచనా వేసింది. ఇదేసమయంలో 49,656 కొత్త యూనిట్లు ప్రారంభమయినట్లుగా పేర్కొంది.
కొత్త ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా ఉన్నా.. విక్రయాలు దానికి తగ్గ స్థాయిలో లేకపోవడంతో అమ్ముడుకాని ఇళ్ల నిల్వ కొంత పెరిగింది. నగర రియల్టీ మార్కెట్‌లో ఉద్యోగాల సృష్టి, ఐటీ, కార్పొరేట్ రంగాల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి కారణంగా డిమాండ్ బలపడే అవకాశాలున్నాయని నివేదిక అంచనా వేసింది.