విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల మార్పుల మధ్య హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలకు బ్రేక్ లు వేస్తూ గురువారం స్పల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 770 తగ్గి రూ. 1,62,980 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 1,49,400 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 2,64,900 వద్ద కొనసాగుతుంది.
సుంకాల తగ్గింపు తో భారత్ లో ధరల నియంత్రణకు అవకాశం
అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గదల నిర్ణయాలు, డాలర్ విలువ, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో.. సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు తక్కువని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు భారత్ లో పశ్చిమాసియా సంక్షోభం సందర్భంగా విదేశీ మారక ద్రవ్వ నిల్వల పరిరక్షణ చర్యల్లో భాంగా పెంచిన బంగారం, వెండి దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్ వర్గాలకు ఆశాజనకంగా మారాయి.
అధిక పన్నుల భారం కారణంగా అక్రమంగా బంగారం, వెండి దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు మనీ కంట్రోల్ పేర్కొంది.భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారులలో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండటం గమనార్హం.
ప్రస్తుతం 15 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 6 శాతానికి తగ్గించాలని బులియన్ వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు కేంద్రాన్ని కోరుతున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు(డాలర్ నిల్వలు) కాపాడేందుకు, రూపాయి విలువ క్షీణించకుండా ఉండేందుకు ఈ సంవత్సరం మే 13న బంగారం, వెండిపై కేంద్రం దిగుమతి సుంకం విధించింది. 6 శాతం ఉన్న సుంకాన్ని 15 శాతానికి పెంచింది. దీని వల్ల బంగారం ధర పెరిగింది. ప్రతిగా అక్రమ మార్గాల్లో బంగారం దేశంలోకి వస్తోంది.
అయితే సుంకాన్ని తగ్గించడం వల్ల అనధికారిక మార్గాల ద్వారా దేశంలోకి వచ్చే బంగారం తగ్గుతుందని, తద్వారా అక్రమ రవాణాకు ఉన్న ప్రోత్సాహం తగ్గుతుందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒక వేళ ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే భారత్ లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది .