విధాత, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా దేశంలో పసిడి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 1,62,970 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 1,49,390 వద్ద ఆగింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 2,64,900 వద్ద కొనసాగుతుంది.
మళ్లీ పుంజుకునే అవకాశం…
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ప్రస్తుతానికి స్వల్ప తగ్గుదల నమోదు చేసినప్పటికి..సెప్టెంబర్ నెలలో మాత్రం మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 ఆగస్టు నెలలో బంగారం ధరలు వరుసగా ఐదవ వారం కూడా గరిష్ఠాల వైపు పయనిస్తూ.. 1999 తర్వాత అత్యుత్తమ నెలవారీ వృద్ధిని నమోదు చేసే దిశగా దూసుకుపోతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు అత్యున్నతంగా 4,607.90 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
డాలర్ సూచీలో బలహీనత, అమెరికా డెట్ మార్కెట్ ఆందోళనలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేయడం బంగారం ధరల రికార్డు ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ రాబడి 20 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 5.34% కి చేరుకున్నప్పటికీ.. బంగారంపై ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గకపోవడం గమనార్హం. సాధారణంగా బాండ్ రాబడులు పెరిగినప్పుడు వడ్డీ చెల్లించని బంగారం ఆకర్షణ తగ్గుతుంది. అమెరికా ప్రభుత్వ అప్పు ఏకంగా 40 ట్రిలియన్ డాలర్లకు (రూ. 3,800 లక్షల కోట్లు) చేరుకోవడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారానికే మొగ్గు చూపుతున్నారు.
ట్రేడింగ్ ఎకనామిక్స్, సిటీ బ్యాంక్ అంచనాల ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో (MCX) 10 గ్రాముల బంగారం ధర రూ. 1.55 లక్షల నుండి రూ.1.66 లక్షల మధ్య కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 4,900 డాలర్ల రెసిస్టెన్స్ దాటితే, దేశీయ మార్కెట్‌లో త్వరలోనే రూ. 1.70 లక్షల నూతన మైలురాయిని తాకవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే బంగారం ధరలు కొంత నియంత్రణలో ఉండవచ్చని అంచనా.