న్యూఢిల్లీ : నేపాల్ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 21 మందిని కాపాడినట్లు తెలిపింది. వీరంతా తమిళనాడుకు చెందినవారని పేర్కొంది. మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు భారత పౌరులు చైనా వైపు టిబెట్‌లో చిక్కుకుపోయినట్లు వెల్లడించింది. అక్కడి నుంచి సుమారు 200 మంది సాయం కోసం విజ్ఞప్తి చేశారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్‌వాల్ మీడియా సమావేశంలో చెప్పారు. వరదల నేపథ్యంలో ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు. సహాయక చర్యల విషయంలో నేపాల్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు. మానవతా సాయంతో కూడిన రెండు విమానాలను ఇప్పటికే ఖాట్మాండ్ కు పంపాం అని, మొత్తం 47.5 టన్నుల అత్యవసర సామగ్రిని చేరవేశాం అని, బెయిలీ బ్రిడ్జిని పంపుతున్నాం అని జయస్‌వాల్ వెల్లడించారు.
ఆచూకీ తెలియకుండా పోయిన 288 మంది భారతీయుల్లో త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని, తమిళనాడు నుంచి 37, 49 మందితో కూడిన రెండు పర్యాటక బృందాలు ఉన్నాయని, పశ్చిమ బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది, మిగతావారు వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు.
.270 దాటిన వరదల మృతుల సంఖ్య
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతి చెందినవారి సంఖ్య 270కు పెరిగింది. అదేవిధంగా నేపాల్, టిబెట్‌లలో కలిపి 1,600 మందికిపైగా గల్లంతయినట్లు సమాచారం. వీరిలో 500 మందికిపైగా విదేశీయులు ఉన్నారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. బాధితుల్లో చాలా మంది ట్రెక్కింగ్ లేదా కైలాస మానస సరోవర యాత్ర కోసం వచ్చిన వారేనని తెలిపింది. నేపాల్ టూరిజం బోర్డు వివరాల ప్రకారం.. గల్లంతయిన వారిలో భారత్‌తోపాటు అమెరికా (65), ఉక్రెయిన్ (53), మలేషియా (51) సహా 30 దేశాలకుపైగా పౌరులు ఉన్నారని సమాచారం. హిమాని సరస్సు బద్దలై మంచు కొండ చరియలు విరుచకపడిన నేపథ్యంలో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోశీ నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. వరదల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి.