హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావు ఆ పార్టీ అధినేత, మాజీ కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 27, 2026, 5:10 pm IST
Read Time: 8 mins
హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావు ఆ పార్టీ అధినేత, మాజీ కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. మెదక్ జిల్లా సహా తన వర్గం నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లుగా..తాజాగా మెదక్ ఎమ్మెల్యేలతో రహస్యంగా చెప్పినట్లు తనకు సమాచారం ఉందన్నారు. గురువారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్యేలతో ..ఎన్టీఆర్ గొప్ప నాయకుడు. కానీ ఆయన కుమారుడు ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారని, కేసీఆర్ కూడా గొప్ప నాయకుడే, కానీ ఆయన కుమారుడు ఆయన వారసుడు కాలేడని, కేసీఆర్ వారసురాడిని నేనే అవుతానని చెప్పారని నాకు సమాచారం ఉందని కవిత వెల్లడించారు. రాజ్ పుష్ప ఓపెన్ స్కైస్ విల్లాస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నేతలను కలుస్తున్నారని, ఈ సమావేశాలు “మిరియాలు-పసుపు పాలు” అనేది ఒక సంకేత పదంతో సాగుతున్నాయని కవిత ఆరోపించారు.

ఏ రేవంత్ రెడ్డి అంటే..ఆంధ్రా రేవంత్ రెడ్డి

సీఎం అనుముల రేవంత్ రెడ్డిని ‘ఆంధ్ర రేవంత్ రెడ్డి’అని అనాల్సిన పరిస్థితి వచ్చిందని కవిత విమర్శించారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. దీనిని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తక్షణం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని తొలగించి తెలంగాణ వారిని నియమించాలన్నారు. రెడ్కో, ఎలక్ట్రిసిటీ సహా పలు శాఖలలో ఆంధ్రోళ్ల పెత్తనం సాగుతుందని, ఉద్యమకారులకు కోసం వేసిన కేకే కమిటీ..కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ప్రజల పైసలుతో కట్టిన యాదగిరిగుట్ట పాలక మండలిలో ఆంధ్రోళ్లను నియమించారని, ఓ హీరో భార్యను సభ్యురాలిగా నియమించారని కవిత విమర్శించారు. తన విదేశీ పర్యటన రద్దుతో రేవంత్ రెడ్డికి తెలంగాణ వాదం గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సంస్థలలో ఆంధ్రోళ్లను నియమిస్తున్న రేవంత్ రెడ్డిని ఆంధ్రా ఏజెంట్ గానే భావిస్తామని కవిత స్పష్టం చేశారు.

గుంపు మేస్త్రీకి గుంటనక్కకు మధ్య అవగాహాన

గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డికి, గుంటనక్క హరీశ్ రావుకు మధ్య లండన్ లో ఎలాంటి ఒప్పందం జరుగకపోతే గత ప్రభుత్వంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని సొంత డెయిరీకి లాభం చేకూర్చిన హరీశ్ రావుపై క్విడ్ ప్రోకో కేసు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మంత్రిగా పనిచేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ రంగంలోని డెయిరీని కాదని తన సొంత డెయిరీ ద్వారా కార్పొరేట్ కాలేజీలు, సంస్థలు, హాస్పిటళ్లకు పాలు సరఫరా చేసి 8 ఏళ్లలో వందల కోట్ల వ్యాపారం చేయడం క్విడ్ ప్రో కో కాదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మాజీ మంత్రి హరీశ్ రావుతో లండన్ లో ఎలాంటి ఒప్పందం జరిగి ఉండకపోతే వెంటనే ఈ వ్యవహారంపై క్విడ్ ప్రోకో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు యశోధ ఆసుపత్రికి ప్రభుత్వ భూమి ఇచ్చారని, ప్రతిగా ఆ ఆసుపత్రికి పాలు
సరఫరా చేస్తూ లబ్ధి పొందుతున్నాడన్నారు. పాల వ్యాపారం హరీశ్ రావుకు, రియల్ ఎస్టేట్, మున్సిపల్ పర్మిషన్లు కేటీఆర్ కు, ఇసుక వ్యాపారం ఇంకొకరికి అన్నట్లుగా బీఆర్ఎస్ పాలన వ్యవస్థీకృత అవీనితిమయంగా సాగిందని కవిత ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావుతో లాలూచీ లేకపోతే వెంటనే 500 మంది విద్యార్థులు పైగా ఉన్న ప్రతి విద్యా సంస్థలకు ప్రైవేటు డెయిరీల ద్వారా కాకుండా ప్రభుత్వ, సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డెయిరీల నుండి పాల సరఫరా చేసే విధంగా జీవో ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఊదరగొట్టాడని, ఇప్పుడు ఆ కేసులు ఏమయ్యయో రేవంత్ రెడ్డి చెప్పాలని, ఇక్కడ బీఆర్ఎస్ తో లాలూచీ, కేంద్రంలో బడా భాయ్ మోదీతో సీఎం లాలూచీ కొనసాగిస్తున్నారని కవిత ఆరోపించారు. గుంట నక్క, గుంపు మేస్త్రీల మధ్య జరిగిన లండన్ ఒప్పందంపై మరిన్ని విషయాలు బయటపెట్టబోతున్నామని కవిత వెల్లడించారు. ఈ నెల 31న నిజామాబాద్ లో జరుగనున్న టీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కవిత కోరారు.