Noida Techie Death | నోయిడా టెకీ యువరాజ్​ మరణానికి బాధ్యులెవరు?

నోయిడా సెక్టరు–150లో టెకీ యువరాజ్ మెహతా కారు దట్టమైన పొగమంచు కారణంగా నీటితో నిండిన నిర్మాణ గుంతలో పడిపోవడంతో మృతి చెందారు. రక్షణ బృందాలు సమయానికి చేరుకున్నా, నీటి లోతు, మబ్బు, ఇనుపరాడ్లు కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.

Noida Techie Death | నోయిడా టెకీ యువరాజ్​ మరణానికి బాధ్యులెవరు?

Who Is Responsible for Noida Techie Yuvraj Mehta’s Death? Investigation Underway

సారాంశం:
నోయిడా సెక్టరు–150లో సాఫ్ట్​వేర్ ఇంజనీర్ యువరాజ్  మెహతా కారు దట్టమైన పొగమంచు కారణంగా నీటితో నిండిన నిర్మాణ గుంతలో పడిపోవడంతో మృతి చెందారు. రక్షణ బృందాలు ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో ఆయనను సమయానికి బయటకు తీయలేకపోయారు. ఘటనపై నోయిడా అథారిటీ, పోలీసులు చర్యలు చేపట్టాయి.

 

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

Noida Techie Death | నోయిడా సెక్టర్​–150లో గత శుక్రవారం 27 ఏళ్ల సాఫ్ట్​వేర్​ ఇంజనీర్ యువరాజ్ మెహతా ప్రమాదవశాత్తు కందకంలో పడి దుర్మరణం పాలైన ఘటనపై పలు వాస్తవాలు మెల్లగా బయటపడుతున్నాయి. ఈనెల 16న శుక్రవారం అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన, దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపై ఏదీ కనిపించక నియంత్రణ కోల్పోయి నిర్మాణంలో ఉన్న ఇంటికి సంబంధించి నీటితో నిండిన కందకంలో కారుతో సహా పడిపోయాడు. సంఘటనాస్థలి తన ఇంటి నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది.

సరైన సమయంలోనే సమాచారం – రక్షణ బృందాల వైఫల్యం

UP Police and SDRF teams conducting rescue operations in dense fog at the water-filled construction pit in Noida Sector 150.

ప్రమాదం జరిగిన వెంటనే యువరాజ్ తన తండ్రి రాజ్‌కుమార్ మెహతకు ఫోన్ చేసి పరిస్థితి తెలియజేశాడు. ఆయన 112 హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు రాత్రి 12.50 గంటలకు, ఫైర్ బ్రిగేడ్ తర్వాత కొద్ది నిమిషాలకు అక్కడికి చేరుకున్నారు. స్థలానికి చేరుకున్న అధికారులు పొగమంచు కారణంగా గుంతలో వాహనం ఉన్న ప్రదేశం కచ్చితంగా గుర్తించడంలో ఇబ్బందులు పడ్డారు. కారులో చిక్కుకుపోయిన యువరాజ్ మొబైల్ టార్చ్ వెలిగించి సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

రక్షణ బృందాలు తాళ్లు, క్రేన్, సెర్చ్‌లైట్లు వంటి పరికరాలు ఉపయోగించి వాహనాన్ని చేరుకునే ప్రయత్నం చేసినా, కందకం లోతు, చీకటి, పొగమంచు, గుంతలోని ఇనుపచువ్వలు, రాళ్ల కారణంగా  కారణంగా పరిస్థితిని నియంత్రించడం కష్టమైంది. దీంతో యువరాజ్‌ను వెంటనే బయటకు తీయడం సాధ్యపడలేదు. ఆయన దాదాపు 90 నిమిషాలపాటు సహాయం కోరుతూ కారులోనే ఉన్నప్పటికీ, రక్షించలేకపోయారు. కొందరు స్థానిక యువకులు కాపాడ్డానికి ప్రయత్నించినా, వారికి సాధ్యం కాలేదు.

ప్రమాదాలు నిత్యకృత్యం – ప్రభుత్వం నిర్లక్ష్యం

Daytime view of the water-filled construction pit in Noida Sector 150, where techie Yuvraj Mehta’s car had fallen during dense fog.

టాటా యూరేకా పార్క్ సమీపంలోని ఈ గుంతను బిల్డర్లు బేస్మెంట్ నిర్మాణం కోసం తవ్వినా, అక్కడ బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు లేదా లైట్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మరో వాహనం కూడా ప్రమాదానికి గురైనట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల లోపమే ఈ ఘటనకు కారణమని వారు పేర్కొంటున్నారు. యువరాజ్​ తండ్రి రాజ్​కుమార్​ మెహతా స్థానిక అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్​ చేసారు.

ఆ తర్వాత SDRF మరియు NDRF బృందాలు రాత్రి 1.15 గంటలకు, 1.55 గంటలకు స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చివరకు వాహనాన్ని, యువరాజ్ మృతదేహాన్ని తెల్లవారుజామున 4.30 గంటలకు బయటకు తీశారు. ఆయన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, ఊపిరితిత్తుల్లో దాదాపు 200 మిల్లీలీటర్ల నీరు ఉండటం, దానివల్లే గుండెపోటు రావడం మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు.

ప్రజల తిరుగుబాటు – ప్రభుత్వం దిద్దుబాటు

ఈ ఘటనపై నోయిడా ప్రజానీకం తీవ్రంగా స్పందించింది. సోషల్​మీడియాలో పౌరులు విరుచుకుపడ్డారు. నగరపాలన సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాదాపు 2 గంటల సేపు యువరాజ్​ యాతనపడ్డా, వేడుకున్నా ప్రభుత్వం  కాపాడలేకపోయిందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు.

నిర్మాణ సంస్థలు, నోయిడా అథారిటీ, ట్రాఫిక్​ వ్యవస్థ, రక్షణ బృందాలు.. ఈ నాలుగు వ్యవస్థల కారణంగానే యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోవాల్సివచ్చిందని సోషల్​మీడియాలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. నోయిడా అథారిటీ ఒక జూనియర్ ఇంజనీర్‌ను విధులనుండి తొలగించింది. మరికొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ నీటి గుంతను పూడ్చే పనులు మొదలయ్యాయి. నిర్మాణ బాధ్యత వహిస్తున్న MJ Wishtown Planner Ltd మరియు Lotus Green Construction Pvt Ltd సంస్థలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

యువరాజ్ కుటుంబం, ఈ ప్రమాదంలో రక్షణ బృందాల సంసిద్ధతలో లోపాలు ఉన్నాయని, సమయానికి నిపుణులైన ఈతగాళ్లు అందుబాటులో ఉంటే ప్రాణాపాయం తప్పేదని వాపోయింది. ఆ ప్రాంతంలోని భద్రతా లోపాలపై గతంలోనూ ఫిర్యాదులు ఉన్నప్పటికీ, స్పందన లేదని వారు తెలిపారు. ఈ ఘటన తర్వాత నోయిడా అథారిటీ ఆ ప్రాంతంలోని బ్లైండ్ స్పాట్స్‌ను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది.

ఈ ప్రమాదం రాత్రివేళల రోడ్డు భద్రత, నిర్మాణ ప్రాంతాల వద్ద హెచ్చరికల ఏర్పాటు, రక్షణ బృందాల అత్యవసర సంసిద్ధత వంటి అంశాలమీద కొత్త చర్చలు తెరపైకి తెచ్చింది.