AP Legislative Council : చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!

ఏపీ శాసన మండలిలో మతపర వ్యాఖ్యలతో ఉద్రిక్తత. చైర్మన్ మోషే రాజుపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు రచ్చ చెలరేగగా, చివరికి మంత్రి క్షమాపణ చెప్పారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Mar 04, 2026, 3:47 pm IST
Read Time: 5 mins
AP Legislative Council : చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!

అమరావతి: ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డూ..కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చ అదుపు తప్పి హైటెన్షన్ క్రియేట్ చేసింది. చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ .. మీరు, మీ నాయకుడు జగన్ ఇద్దరూ క్రిస్టియన్సే అంటూ చైర్మన్ మోషేను రాజుని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం మీద, వేంకటేశ్వర స్వామి మీద వైసీపీ కక్ష కట్టిందన్న అచ్చెన్నాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను చైర్మన్ మోషే రాజు తీవ్రంగా ఖండించారు. నేను క్రిస్టియ‌న్ అని ఎవ‌రు చెప్పారు.. నేను హిందువునని..అయినా చైర్మన్ కుర్చీకి మతాన్ని ఆపాదించడం ఏమిటంటూ మోషే రాజు మండిపడ్డారు. వెంటనే తన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు ఉపసంహరించుకోవాలన్నారు.

మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు భగ్గుమన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నాలు సాగాయి. సభలో పోటాపోటీగా నినాదాలు.. పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు దిగారు. సభ్యుల తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. సభ్యులను నియంత్రించేందుకు మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి,వైసీపీ సభ్యుడు మాధవరావు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ..మాధవ్ నీకు చెప్తున్నా దేవుడు నిన్ను వొదిలిపెట్టాడు.. టైం అండ్ డేట్ రాసుకో బ్రదర్ అంటూ శాపనార్ధాలు పెట్టారు.

ఇంకోవైపు చైర్మన్ సూచనలతో దిగొచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్ పై చేసిన మతపరమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయినప్పటికి అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగింది.

అంతకుముందు మంద్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ .. మీ జగన్ రెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, లడ్డూ కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని.. సభలో మీ హడావిడి ఏంటని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంపై ఎంతసేపైనా చర్చించేందుకు సిద్ధమని అన్నారు. మీ జగన్ రెడ్డికి హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు,మీ నాయకుడు తిరుమల వెళ్ళడు మాకు తెలుసు అంటూ పయ్యావుల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు మూకుమ్మడిగా ప్రతి విమర్శలతో విరుచుకపడ్డారు.

ఇవి కూడా చదవండి :

Karnataka Phone Tapping Allegations : కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!
రాజ్యసభ ఎన్నికల వేడి..అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి