• Telugu News
  • /Hyderabad

బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!

శంషాబాద్‌లోని బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని కంచె వేసేందుకు హైడ్రా, రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యలు స్థానిక రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది.

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Jul 18, 2026, 1:05 pm IST
Read Time: 4 mins
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!

శంషాబాద్‌లోని బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని కంచె వేసేందుకు హైడ్రా, రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యలు స్థానిక రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది. భారీ పోలీసు భద్రత మధ్య భూములకు కంచె వేసే ప్రయత్నం చేసిన హైడ్రా, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకొని తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా అధికారులు ఆగకుండా తమ పని కొనసాగించేందుకు సిద్దపడటంతో గా రైతులు ఆందోళనకు దిగి వారికి అడ్డుపడ్డారు.

దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రైతు నరసింహ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా తోటి రైతులు అడ్డుకొనడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్‌లోని బహదూర్‌గూడలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్‌జీఐఏ సమీపంలో ప్రతిపాదిత హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న స్వాధీనం చర్యలకు ఆ ప్రాజెక్టుతో ప్రత్యక్ష సంబంధం ఉందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు టెర్మినల్ కోసం భూముల సేకరణకు అధికారులు రాగా, రైతులు తీవ్రంగా నిరాకరిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు, సరైన పరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.